
మధ్యాహ్న భోజనం వండలేం..
గిట్టుబాటు కావడం లేదంటున్న కార్మికులు
కొన్ని జిల్లాల్లో అధికారులకు సమ్మె నోటీసుల అందజేత
ఈనాడు, హైదరాబాద్: సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం వంట ఇక తమ వల్ల కాదని మహిళా కార్మికులు తేల్చిచెబుతున్నారు. తమకు ఇచ్చే గౌరవ వేతనం, ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని.. వాటిని పెంచకుంటే భోజనం వండలేమని కొన్ని జిల్లాలో ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పగా.. మరికొన్ని జిల్లాల్లోనూ సమ్మె బాట పడుతున్నారు. నెలకు గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.6 ఉండగా.. ప్రభుత్వం తమకు రూ.4 మాత్రమే చెల్లిస్తోందని, కూరగాయల ధరలూ పెరగడంతో తమకు గిట్టుబాటు కావడం లేదన్నది కార్మికుల ఆవేదన. బిల్లుల్ని సకాలంలో చెల్లించడం లేదని వారు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 1 నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ నెల 6 నుంచి సమ్మె చేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్‌కు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నోటీసు అందజేసింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ కార్మికులు సోమవారం నుంచి బంద్ చేయాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కరీంనగర్, ఆదిలాబాద్ డీఈవోలు జనార్దన్‌రావు, మాధవి ఆయా ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లాలో కూడా అధికారులు ప్రధానోపాధ్యాయులను ప్రత్యామ్నాయం చూడాలని సంక్షిప్త సందేశాలు పంపారు.