ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీటీ స్కాన్‌ యంత్రాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు

Published : 14 Dec 2021 05:29 IST

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

నిలోఫర్‌ అసుపత్రిలో సీటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ.. పక్కన ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు తదితరులు

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీటీ స్కాన్‌ యంత్రాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లతో సమావేశమై మాట్లాడారు. నిలోఫర్‌లో చిన్న పిల్లల కోసం రూ.33 కోట్లతో చేపట్టిన 800 పడకల సామర్థ్యం గల ప్రత్యేక బ్లాక్‌ పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాలని టీఎస్‌ఎంఐడీసీని ఆదేశించామన్నారు. రాష్ట్రంలోని మరో 13 జిల్లాల్లో టి-డయాగ్నొస్టిక్‌ సెంటర్లను, ములుగు, సిరిసిల్లలో హెల్త్‌ ప్రొఫైల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి నిలోఫర్‌కు వస్తున్న రోగులకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు వివరించారు. ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు సమకూర్చాలని టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ను ఆదేశించామన్నారు. వైద్యులు ప్రతి నెల పురోగతి నివేదికను డీఎంఈ రమేష్‌రెడ్డికి సమర్పించాలన్నారు. నిమ్స్‌, నిలోఫర్‌లో చిన్న పిల్లల గుండె వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక విభాగం, వార్డు ఏర్పాటుపై కమిటీ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, వైద్యాధికారులు లాలూప్రసాద్‌ రాథోడ్‌, రవికుమార్‌, రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఎయిమ్స్‌ అభివృద్ధికి తోడ్పాటు
బీబీనగర్‌, న్యూస్‌టుడే: బీబీనగర్‌ ఎయిమ్స్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పడుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. యునిసెఫ్‌ ఆధ్వర్యంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్యులు రూపొందించిన ‘కొవిడ్‌ రిపోర్ట్‌ ఆన్‌ మెంటల్‌ హెల్త్‌’ను సోమవారం ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియతో కలిసి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ పురోగతిని డైరెక్టర్‌ ద్వారా తెలుసుకుని మాట్లాడారు.

Read latest State News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు