విధులు కేటాయించని ఉద్యోగుల వివరాలివ్వండి

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో వివిధ కారణాల వల్ల విధులు కేటాయించని అధికారుల వివరాలు సమర్పించాలంటూ సర్కారుకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 19 Jan 2022 03:52 IST

లేదంటే ప్రధాన కార్యదర్శి హాజరుకావాల్సి ఉంటుంది

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో వివిధ కారణాల వల్ల విధులు కేటాయించని అధికారుల వివరాలు సమర్పించాలంటూ సర్కారుకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కారణాలను పేర్కొంటూ పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని సూచించింది.లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణను మార్చి 14కి వాయిదా వేసింది. పోస్టింగులు ఇవ్వకుండా నెలలు, ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచుతూ ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తుండటాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన బి.నాగేందర్‌సింగ్‌ 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.వెంకన్న వాదనలు వినిపిస్తూ క్రమశిక్షణ చర్యలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇక్కడికి వచ్చినవారు, ఇతర శాఖల నుంచి బదిలీపై వచ్చినవారు తదితర శాఖల ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఖజానాకు రూ.కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. ఎలాంటి సేవలు పొందకుండానే రూ.3 కోట్ల దాకా చెల్లించినట్లు తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని