ఎఫ్‌ఆర్‌సీ ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి

నాన్‌మైనారిటీ, మైనారిటీ వైద్య కళాశాలలు పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు 2016-19 కాలానికి ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ప్రకారమే రుసుములు వసూలు చేయాలని బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 20 Jan 2022 05:38 IST

నాన్‌మైనారిటీ, మైనారిటీ వైద్య కళాశాలల్లో రుసుములపై హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: నాన్‌మైనారిటీ, మైనారిటీ వైద్య కళాశాలలు పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు 2016-19 కాలానికి ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ప్రకారమే రుసుములు వసూలు చేయాలని బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులకు విరుద్ధంగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయించడం అధికార పరిధిని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకుగాను 2016-19 కాలానికి నాన్‌మైనారిటీ, మైనారిటీ కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తూ 2017 మే 9న జారీ చేసిన జీవోలు 41, 43లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకు ప్రభుత్వం 2016 మే 2న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారమే కాలేజీలు ఫీజులను వసూలు చేయాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఫీజులు చెల్లించిన విద్యార్థులకు తక్షణం సర్టిఫికెట్‌లను వాపసు ఇవ్వాలని, ఒకవేళ ఎక్కువ చెల్లించినట్లయితే 30 రోజుల్లోగా వాపసివ్వాలని ఆదేశించింది. నాన్‌మైనారిటీ, మైనారిటీ వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తూ 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 41, 43లను సవాలు చేస్తూ హెల్త్‌కేర్‌ రిఫార్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.మహేష్‌కుమార్‌ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు, ఇతర పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించి తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని