రైల్వేలో తెలంగాణకు తీవ్ర అన్యాయం

రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదన్నారు.

Published : 21 Jan 2022 06:28 IST

కేంద్రమంత్రికి వినోద్‌కుమార్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఆర్నెల్లలోనే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఇప్పటివరకు అతీగతీ లేదన్నారు. రానున్న రైల్వేబడ్జెట్‌లో కొత్త లైన్లతో పాటు కాజీపేటలో రైల్వే కోచ్‌ల తయారీ కర్మాగారం మంజూరు  చేయాలని కోరుతూ ఆయన గురువారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు
‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తపల్లి - మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ మాత్రమే మంజూరైంది. కరీంనగర్‌ - కాజీపేట్‌, మణుగూరు - రామగుండం, నంద్యాల - జడ్చర్ల, కోయగూడెం మైన్స్‌ - తడికలపూడి, భద్రాచలం రోడ్‌ - విశాఖపట్నం లైన్ల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. మరో 25 రైల్వే కొత్త లైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందటే ప్రతిపాదనలు పంపింది. వీటిలో గద్వాల - మాచర్ల ఆధునికీకరణ, మౌలాలి - భువనగిరి, మౌలాలి - ఘట్‌ కేసర్‌, ఘట్‌ కేసర్‌ - భువనగిరి, కాచిగూడ - చిట్యాల ఉన్నాయి. సికింద్రాబాద్‌ - జహీరాబాద్‌, విష్ణుపురం - వినుకొండ, కరీంనగర్‌ - హసన్‌పర్తి, మహబూబ్‌నగర్‌ - గుత్తి, సికింద్రాబాద్‌ -మూడ్ఖేడ్‌ - ఆదిలాబాద్‌, ఘన్‌పూర్‌ - సూర్యాపేట, బోధన్‌ - లాతూర్‌ రోడ్‌, యావత్‌ మాల్‌ - ఆదిలాబాద్‌ లైన్లు కూడా రాష్ట్ర సర్కారు కోరింది. కొత్తగూడెం - కొత్తపల్లి మధ్య సర్వే అప్‌డేట్‌ పనులు, సికింద్రాబాద్‌-కాజీపేట మధ్య మూడో లైన్‌, వికారాబాద్‌ వద్ద బైపాస్‌ లైన్‌, ఆర్మూర్‌ - ఆదిలాబాద్‌ మధ్య కొత్త లైన్‌ అప్‌డేషన్‌, బీబీనగర్‌ - గుంటూరు మధ్య విద్యుదీకరణ, అకొలా-డోన్‌ మధ్య విద్యుదీకరణ కోసం కూడా ప్రతిపాదనలు పంపాం’ అని వినోద్‌  లేఖలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని