ధరల ధగధగల సంపత్తి

తెలంగాణలో దూది పూల సోయగం ధరల ధగధగతో మెరుస్తోంది. ఒకప్పుడు మద్దతు ధర ఆశలే గగనమైన చోట ఈసారి రైతుకు సంపత్తినిచ్చిన పంటగా పత్తి ఖ్యాతినందుకుంటోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్లలోకి వస్తున్న తెల్లబంగారానికి వ్యాపారులు దండిగానే ధరను నిర్ణయిస్తున్నారు.

Published : 21 Jan 2022 06:27 IST

తెల్ల బంగారానికి రికార్డు స్థాయిలో రెక్కలు
ఈ సీజన్‌లో క్వింటాకు అత్యధికంగా రూ.10,200

జమ్మికుంట మార్కెట్‌ యార్డులో జరుగుతున్న పత్తి విక్రయాలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తెలంగాణలో దూది పూల సోయగం ధరల ధగధగతో మెరుస్తోంది. ఒకప్పుడు మద్దతు ధర ఆశలే గగనమైన చోట ఈసారి రైతుకు సంపత్తినిచ్చిన పంటగా పత్తి ఖ్యాతినందుకుంటోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్లలోకి వస్తున్న తెల్లబంగారానికి వ్యాపారులు దండిగానే ధరను నిర్ణయిస్తున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్‌ మార్కెట్‌యార్డులో రికార్డు స్థాయిలో క్వింటా పత్తిని రూ.10,200కు రైతులు అమ్ముకున్నారు. అదేరోజున ఖమ్మం మార్కెట్లో రూ.10 వేలు, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో రూ.9,800, మహబూబ్‌నగర్‌ జిల్లా బాదెపల్లిలో రూ.9,899 గరిష్ఠ ధర పలికింది. మరుసటి రోజున కేసముద్రం మార్కెట్‌లోనూ క్వింటా పత్తిని రూ.10,101కు రైతులు విక్రయించారు. పక్షం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో 15 నుంచి 20చోట్ల రూ.9వేలకు పైగా ధర రైతుకు దక్కుతుండటం గమనార్హం.

మద్దతు ధరకు అదనంగా 70%..
పత్తికి ఈ సీజన్‌లో వచ్చిన ధర ఎప్పుడూ రాలేదని మార్కెటింగ్‌శాఖ అధికారులతోపాటు రైతులు ఆనందంగా చెబుతున్నారు. గతంలో ఎక్కువలో ఎక్కువగా రూ.7-8 వేల ధర అదను దాటిన తరువాత అమ్మిన వాళ్లకు లభించేది. చాలా చోట్ల భారత పత్తి సంస్థ(సీసీఐ) ఈసారి కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు అవసరాన్ని బట్టి తెల్లబంగారానికి మంచి ఖరీదు కడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.6,025కు దాదాపుగా 70 శాతం అదనంగా పలుకుతోంది. డిసెంబరు 1 నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,03,585.32 టన్నుల పత్తిని మార్కెటింగ్‌శాఖ పర్యవేక్షణలో కొనుగోలు చేశారు.

తగ్గిన విస్తీర్ణం.. దిగుబడి
సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు పండిన పంటలోనూ దిగుబడి దెబ్బ పత్తి రైతులను పరేషాన్‌ చేసింది. గతేడాది (2021)లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాధారణ సాగు అంచనా 47.60 లక్షల ఎకరాలు కాగా 46.42 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అంతుకుముందు ఏడాదిలో 60.53 లక్షల ఎకరాల్లో రైతులు ఆసక్తిని చూపించారు. ఏడాదిలో దాదాపుగా 14లక్షల ఎకరాల్లో తగ్గిన సాగుతో పాటు చీడపీడల బెడద, పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాల కారణంగా దిగుబడిపై ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో 50శాతం మంది అమ్ముకున్నారు. గతంలో సెకండ్‌ గ్రేడ్‌ క్వింటా పత్తిని రూ.3,500కు కూడా కొనేందుకు ఆలోచించే వ్యాపారులు ఈసారి రూ.6,500కుపైగా వెచ్చిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని