
తుమ్మల రంగారావుకు ఊరట
ఎమ్మార్‌లో ఈడీ కేసుపై హైకోర్టు స్టే
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మార్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో నిందితుడైన తుమ్మల రంగారావుకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు రోజులకు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో తనను నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ తుమ్మల రంగారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘సీబీఐ పిటిషనర్‌తో పాటు అతనికి చెందిన స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిందితుల జాబితాలో చేర్చింది. అప్రూవర్‌గా మారడంతో అభియోగపత్రంలో నిందితుల జాబితా నుంచి తొలగించింది. పిటిషనర్‌ను సాక్షిగా పరిగణనలోకి తీసుకుని వాంగ్మూలం నమోదు చేసుకుంది. దీనికి సీబీఐ కోర్టు కూడా ఆమోదం తెలుపుతూ క్షమాపణ మంజూరు చేసింది. ఈడీ కేసులో కూడా సాక్షిగా పరిగణనలోకి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అయితే ఈడీ నిందితుడిగా చేర్చింది. ఈడీ అభియోగపత్రాన్ని ఇప్పటికే విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్నందున కేసును కొట్టివేయాలి. కోనేరు రాజేంద్రప్రసాద్ సూచనల మేరకు విల్లా ప్లాట్లను విక్రయించారు.చదరపు గజం రూ.5 వేలు నిర్ణయించగా కాగితాల్లో ఆ మేరకు వసూలు చేశారని, అనధికారికంగా మరికొంత వసూలు చేసి కోనేరు రాజేంద్రప్రసాద్, సునీల్‌రెడ్డిలకు అందజేసినట్లు సీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన మొత్తం రూ.96 కోట్ల దాకా ఉందని అభియోగపత్రంలో పేర్కొంది...’ అని వివరించారు.
Advertisement