
ఎస్సీ కుటుంబాల్లో వెలుగులకే దళితబంధు
లబ్ధిదారులకు యంత్రాలు పంపిణీ చేసిన మంత్రి గంగుల
ఈనాడు డిజిటల్, కరీంనగర్: ఎస్సీ కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ మైదానంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.2.60 కోట్ల విలువైన ఉపకరణాల్ని శుక్రవారం ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆరు హార్వెస్టర్లతోపాటు మూడు జేసీబీ యంత్రాలు, ఒక డీసీఎం వాహనాన్ని వారికి అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఖాతాల్లో నగదు పడిన వారికి అవసరమైన యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. హార్వెస్టర్ యంత్రాన్ని నడిపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్లతోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.
Advertisement