TS News: అప్పు చెల్లించలేదని ఇళ్లకు తాళాలు..రాత్రంతా చలిలోనే గడిపిన బాధితులు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో అప్పు చెల్లించాలంటూ డీసీసీబీ ఉద్యోగులు రుణగ్రహీతల ఇళ్లకు తాళాలు వేయడంతో బాధితులు రాత్రంతా చలిలో నానా అవస్థలు పడ్డారు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు చుట్టుపక్కల వారిని

Updated : 22 Jan 2022 08:59 IST

డీసీసీబీ ఉద్యోగుల నిర్వాకం

కామేపల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో అప్పు చెల్లించాలంటూ డీసీసీబీ ఉద్యోగులు రుణగ్రహీతల ఇళ్లకు తాళాలు వేయడంతో బాధితులు రాత్రంతా చలిలో నానా అవస్థలు పడ్డారు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు చుట్టుపక్కల వారిని అడిగి అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. కామేపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు 2017లో రూ.10 వేల చొప్పున రుణాలు పంపిణీ చేశారు. గరిడేపల్లి, బర్లగూడెం గ్రామాల్లో అయిదు గ్రూపులకు చెందిన 30 మంది సభ్యులు రుణబకాయిలు చెల్లించలేదు. రూ.10 వేల రుణానికి వడ్డీతో కలిసి రూ.20 వేలను డీసీసీబీ అధికారులు వసూలు చేస్తున్నారు. ఇళ్లు జప్తు చేస్తామని గురువారం హెచ్చరికలు చేయడంతో 26 మంది సొమ్ము చెల్లించారు. మరో నలుగురు చెల్లించలేకపోవడంతో డీసీసీబీ సిబ్బంది వారి ఇళ్లకు సీలు వేశారు. మరో అవకాశం ఇవ్వాలని అధికారులను బతిమాలినా కరుణించలేదు. నలుగురిలో ముగ్గురు కౌలు రైతులు. మరొకరు కూలీ. వీరు చేసేదేమీ లేక గురువారం రాత్రంతా ఇంటి బయటే ఉండిపోయారు. కొవిడ్‌ కారణంగా ఇరుగుపొరుగు వారెవరూ ఇళ్లలోకి రానివ్వలేదని బాధితులు భూక్యా రామా, ధరవత్‌ భావ్‌సింగ్‌, శ్రీను, అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్‌ కారణంగా మిరప తోటలు పూర్తిగా దెబ్బ తినడంతో డబ్బుల్లేక అప్పు చెల్లించలేకపోయామన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ముగ్గురు కౌలు రైతులు శుక్రవారం రుణబకాయిలను చెల్లించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని