తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సింహులు (103) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ అంబర్‌పేటలోని తన పెద్దకుమారుడి నివాసంలో గుండెపోటుతో

Published : 23 Jan 2022 04:45 IST

ఆలేరు, అంబర్‌పేట, విద్యానగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సింహులు (103) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ అంబర్‌పేటలోని తన పెద్దకుమారుడి నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు బండ్రు ప్రభాకర్‌, భాస్కర్‌. ముగ్గురు కుమార్తెలు జయ (మరణించారు), అరుణ, విమలక్క (ప్రజాగాయని, అరుణోదయ సాంస్కృతిక కళామండలి తెలుగురాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు). ఈయన అల్లుడు అమర్‌ జనశక్తి రాష్ట్ర మాజీ కార్యదర్శి. ఈయన చిన్న కోడలు బండ్రు శోభారాణి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నాయకుల స్ఫూర్తితో ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చేరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. భువనగిరి, రామాయంపేట, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు చేపడుతూ పేదలకు భూములు పంపిణీ చేశారు. సాయుధ పోరులో భాగంగా నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన బండ్రు 1977లో భువనగిరి నుంచి, 1982లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1984లో మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. నర్సింహులు భౌతికకాయాన్ని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి ఇచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని