విరిసిన 1801 చిరునవ్వులు

తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిదో విడత ఆపరేషన్‌ స్మైల్‌ కొనసాగుతోంది. బాలకార్మికులను.. ఇళ్ల నుంచి తప్పిపోయిన చిన్నారులను.. వెట్టిచాకిరీ, యాచకవృత్తిలో ఉన్న పిల్లలను...

Published : 24 Jan 2022 04:56 IST

‘ఆపరేషన్‌ స్మైల్‌’లో భారీగా చిన్నారులకు విముక్తి

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిదో విడత ఆపరేషన్‌ స్మైల్‌ కొనసాగుతోంది. బాలకార్మికులను.. ఇళ్ల నుంచి తప్పిపోయిన చిన్నారులను.. వెట్టిచాకిరీ, యాచకవృత్తిలో ఉన్న పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఆపరేషన్‌లో జనవరిలో 20 రోజుల వ్యవధిలో 1,801 మందికి విముక్తి కల్పించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఛైల్డ్‌ ట్రాక్‌ పోర్టల్‌, ముఖాలను గుర్తించే ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ ‘దర్పణ్‌’ సేవల్ని వినియోగించడం సత్ఫలితాలనిస్తోంది. తరచుగా చిన్నారులను పనుల్లో పెట్టుకునే వారి జాబితాను సేకరించి వారిపై నిఘా ఉంచుతున్నారు. బాలకార్మికులు ఎక్కువగా ఉండే ట్రాఫిక్‌ కూడళ్లు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, మెకానిక్‌ షాపులు, మతపరమైన స్థలాలు, టీస్టాళ్లు, దుకాణాలు.. తదితర బ్లాక్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీస్‌, కార్మిక, స్త్రీశిశు సంక్షేమ, బాలల సంరక్షణ విభాగం.. తదితర విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఆపరేషన్లు చేపడుతున్నారు.

20 రోజుల్లో విముక్తి పొందిన చిన్నారులు..

* ఆపరేషన్‌ స్మైల్‌ బృందాలు రక్షించిన 1,801 మంది చిన్నారుల్లో 1,472 మంది బాలురు, 329 మంది బాలికలున్నారు.
* మొత్తం చిన్నారుల్లో 1,277 మంది బాలురు, 269 మంది బాలికల్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
* మిగిలిన 255 మందిలో 195 మంది బాలురు, 60 మంది బాలికల్ని పునరావాస కేంద్రాల్లో చేర్పించారు.
* రక్షిత చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు 523 మంది ఉండగా.. వీరిలో 413 మంది బాలురు, 110 మంది బాలికలు.
* విముక్తి పొందిన చిన్నారుల్లో 121 మంది వీధిబాలలు కాగా.. వీరిలో 104 మంది బాలురు, 17 మంది బాలికలు.
* వెట్టిచాకిరీ నుంచి 785 మంది బాలురు, 108 మంది బాలికలకు విముక్తి.
* ఇటుకబట్టీల నుంచి 86 మంది బాలురు, 69 మంది బాలికల్ని.. యాచక వృత్తి నుంచి 30 మంది బాలురు, 51 మంది బాలికల్ని రక్షించారు.
* ఇతర ప్రాంతాలకు చెందిన 467 మంది బాలురకు, 84 మంది బాలికలకు విముక్తి లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని