AP News: 22ఏళ్ల తర్వాత కుటుంబం పలకరింపు..‘ఈనాడు’ కథనంతో తెలిసిన ఆచూకీ

తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి 22 ఏళ్ల క్రితం విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. బాల్యంలో ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని ఆవాస గ్రామం దేవునితోటగా తేలింది.

Updated : 26 Jan 2022 06:49 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి 22 ఏళ్ల క్రితం విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. బాల్యంలో ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని ఆవాస గ్రామం దేవునితోటగా తేలింది.  ఆరేళ్ల వయసులో రైలుని చూడాలనే కోరికతో దుర్గ స్టేషన్‌ వద్దకు వచ్చి రైలు ఎక్కింది. రైలు కదలగా అందులోనే నిద్రపోయి.. కాచిగూడలో దిగింది. రైల్వే పోలీసులు గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలలో చేర్పించారు. ఊరి పేరు గుర్తులేని దుర్గ.. తల్లిదండ్రులు త్రివేణి, ఆంజనేయులు, అక్కాచెల్లెళ్లు వెంకటలక్ష్మి, మంగ, లలిత, మేనత్త సౌదామణి పేర్లను రాసుకొని గుర్తుంచుకుంది. ఇటీవల దుర్గకు మిషనరీ వారు వివాహం జరిపించగా నల్గొండ జిల్లా దామరచర్లలో ఉంటున్నారు. ఆమె గాథపై ‘విధిరాతతో విడిపోయి.. 22 ఏళ్లుగా కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూపులు’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కాగా సామాజిక మాధ్యమాల ద్వారా వార్త షేర్‌ అయింది. కథనంలో దుర్గ పేర్కొన్న పేర్లను గమనించిన లక్ష్మణేశ్వరంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొరివి దామోదరం.. దుర్గ మేనేత్త సౌదామణి, ఆమె కుమారుడు కొండయ్యకు విషయం తెలపగా.. వారు దుర్గకు మంగళవారం రాత్రి ఫోన్‌ చేశారు. ‘హలో దుర్గా.. మాట్లాడుతున్నది మీ మేనత్త సౌదామణిని’ అనగానే తన నోటివెంట మాట రాలేదని దుర్గ భావోద్వేగానికి లోనయ్యారు. 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలవనున్న ఆనందంలో దుర్గ, ఆమె భర్త అశ్వినీకుమార్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని