ఇంకెంత కాలం పెండింగ్‌లో ఉంచాలి?

జగన్‌ అక్రమాస్తుల కేసులో నిధుల అక్రమ మళ్లింపుపై విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్‌తోపాటు ఎండీ పునీత్‌ దాల్మియాలు దాఖలు చేసిన పిటిషన్‌లపై

Published : 28 Jan 2022 04:43 IST

దాల్మియా పిటిషన్‌పై విచారణను ముగించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిధుల అక్రమ మళ్లింపుపై విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్‌తోపాటు ఎండీ పునీత్‌ దాల్మియాలు దాఖలు చేసిన పిటిషన్‌లపై గురువారం హైకోర్టు విచారణను ముగించింది. ‘జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో దాల్మియా సిమెంట్స్‌కు అప్పటి వై.ఎస్‌.ప్రభుత్వం అక్రమంగా లీజులు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టింది. భారతి సిమెంట్స్‌లో ఉన్న వాటాలను విక్రయించడం ద్వారా దాల్మియాకు రూ.146.58 కోట్లు అందింది.  ఇందులో పన్నులు పోను రూ.139 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.55 కోట్లు హవాలా మార్గంలో జగన్‌కు అందింది’ అని సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొంది. దీని ఆధారంగా నిధుల అక్రమ మళ్లింపుపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పునీత్‌ దాల్మియాకు 2014లో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ అప్పట్లో పిటిషన్‌ దాఖలు చేయగా సింగిల్‌ జడ్జి కొట్టివేయడంతో 2016లో అప్పీలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇప్పటికే పలుమార్లు విచారణకు రాగా గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. దాల్మియా తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తారని గడువు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సమన్లను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారని, విచారణకు హాజరయ్యాక ఇక విచారించడానికి ఏముందని ప్రశ్నించింది. సమన్లు సహా ఇతర అంశాలనూ సవాలు చేశామని, వాటిపై వాదనలు వినాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ ఇంకెంత కాలం పెండింగ్‌లో ఉంచాలని ప్రశ్నించింది. ఏదైనా కొత్త అంశం ఉంటే తిరిగి పిటిషన్‌ వేసుకోవచ్చంటూ విచారణను ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని