ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణ విధానంపై తర్జనభర్జన

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం భూసేకరణ వ్యవస్థ ఏర్పాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నాలుగు జిల్లాల మీదుగా వెళుతున్న ఉత్తర మార్గంలో

Published : 28 Jan 2022 04:43 IST

 ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటా? రెవెన్యూ అధికారులకే అప్పగించటమా?

సర్కారులో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం భూసేకరణ వ్యవస్థ ఏర్పాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నాలుగు జిల్లాల మీదుగా వెళుతున్న ఉత్తర మార్గంలో భూసేకరణకు జిల్లాకో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని కోరింది. నాలుగు విభాగాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. ఆ మేరకు రెవెన్యూ శాఖ దస్త్రాన్ని రూపొందించే పనిలో పడింది. అయితే ఈ పనులు వేగంగా సాగటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయటమా? ఆయా జిల్లాల్లోని రెవెన్యూ అధికారులకే అప్పగించటమా? అన్న అంశంపై ఉన్నతస్థాయిలో తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అదనపు వ్యయమవుతుందనే చర్చ సాగుతుందని.. మరోపక్క ఆయా జిల్లాల్లోని అధికారుల ద్వారా చేయించాల్సి వస్తే ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భూ సేకరణను గడువులోగా పూర్తి చేయాలని ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ కోరారు. ఆ సమావేశానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కూడా హాజరయ్యారు.  ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారానే భూ సేకరణను చేపట్టే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. మరోపక్క ఆమోదిత రహదారి ప్రణాళిక మేరకు క్షేత్రస్థాయిలో భూమి గుర్తింపు (మార్కింగ్‌) ప్రక్రియ వేగంగా సాగుతోంది. వచ్చే నెల మూడో వారానికి  పూర్తవుతుందని అంచనా. ఆయా ప్రాంతాల్లోని భూసర్వే నంబర్లను గుర్తించి.. ఆ మేరకు భూ యజమానులకు రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని