Medaram Jathara: మేడారం జాతరకు ఆర్టీసీ యాప్‌

మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడేలా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక యాప్‌ (మేడారం విత్‌ టీఎస్‌ఆర్టీసీ) ప్రారంభించింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం యాప్‌ను ఆవిష్కరించారు. ‘‘వివిధ రకాల సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరిచాం.

Updated : 11 Feb 2022 14:04 IST

ఆవిష్కరించిన ఎండీ సజ్జనార్‌    

ఈనాడు, హైదరాబాద్‌:  మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడేలా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక యాప్‌ (మేడారం విత్‌ టీఎస్‌ఆర్టీసీ) ప్రారంభించింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం యాప్‌ను ఆవిష్కరించారు. ‘‘వివిధ రకాల సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరిచాం. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి మేడారానికి నడిచే బస్సులు, ఛార్జీల వివరాలు, రాకపోకల రియల్‌ టైమ్‌, ట్రాఫిక్‌ తీరుతెన్నులు తెలుసుకోవచ్చు. నావిగేషన్‌ సదుపాయం ఏర్పాటు చేశాం. పోలీసు అధికారులు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల సమాచారం, సమీపంలోని హోటళ్లు..వాటిలో అందుబాటులో ఉన్న గదుల సంఖ్య, ఆసుపత్రులు, కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఉంటాయి. మొబైల్‌ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌  చేసుకుని ఈ సేవలు పొందొచ్చు. మేడారం జాతరకు 50 ఏళ్లుగా ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. గత జాతర సమయంలో 19 లక్షల మంది ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి రూ.30 కోట్ల ఆదాయం లభించింది. అప్పుడు వసూలు చేసిన ఛార్జీలనే ఇప్పుడూ వసూలు చేస్తాం. ఈ సంవత్సరం 3,845 బస్సులు నడుపుతున్నాం. సుమారు 23 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తామన్నది అంచనా. ఈ నెల 13 నుంచి జాతర రద్దీ మొదలు అవుతుంది. ప్రయివేటు పార్కింగ్‌ ప్రాంతం నుంచి 30 షటిల్‌ బస్సులు నడుపుతాం. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు 11 మొబైల్‌ మెకానిక్‌ బృందాలను, బస్సులు మధ్యలో ఆగకుండా 25 ఛేజింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ టీవీ కెమెరాలతో నిఘా పెడుతున్నాం’’ అని ఈ సందర్భంగా సజ్జనార్‌ వివరించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు యాదాద్రి, పురుషోత్తం నాయక్‌, వినోద్‌లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని