Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ నుంచి త్వరలో టీబీ టీకా

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ టీబీ (క్షయవ్యాధి) టీకా ఆవిష్కరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఇందుకోసం స్పానిష్‌ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి టీబీ టీకాను ఆగ్నేయ ఆసియా, సబ్‌-సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేస్తాయి.

Updated : 17 Mar 2022 09:15 IST

స్పానిష్‌ సంస్థ ‘బయోఫాబ్రి’తో భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ టీబీ (క్షయవ్యాధి) టీకా ఆవిష్కరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఇందుకోసం స్పానిష్‌ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి టీబీ టీకాను ఆగ్నేయ ఆసియా, సబ్‌-సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేస్తాయి. ఈ టీకాను (ఎంటీబీ వ్యాక్‌) యూనివర్సిటీ ఆఫ్‌ జరగోజా, ఐఏవీఐ (ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌), ట్యూబర్‌ క్యులోసిస్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌ (టీబీవీఐ) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. భారత్‌ బయోటెక్‌, బయోఫ్యాబ్రి భాగస్వామ్యంతో టీబీ టీకాను, ఆ వ్యాధి అధికంగా కనిపిస్తున్న దేశాలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘ప్రపంచ వ్యాప్తంగా 20 శాతానికి పైగా ప్రజలు టీబీ బారిన పడుతున్నారు. ఎంతో వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి టీకా సరైన పరిష్కారం. తద్వారా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంద’ని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. ఎంటీబీ వ్యాక్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో ఆసక్తికర ఫలితాలు సాధించినందున, దీన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటు ధరలో టీబీ టీకా తీసుకురావాలని భావిస్తున్నామని, టీబీ అధికంగా కనిపిస్తున్న భారత్‌, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాలకు భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్యంతో టీకా అందించే అవకాశం కలుగుతుందని బయోఫ్యాబ్రి సీఈవో ఎస్తెబన్‌ రోడ్రిగూజ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని