వైద్య నియామక సంస్థ ద్వారానే పోస్టుల భర్తీ

వైద్యఆరోగ్యశాఖలో ప్రకటించిన మొత్తం 12,755 పోస్టుల్లో వైద్యులు సహా నర్సులు, ఇతర సిబ్బందిని వైద్య నియామక సంస్థ ద్వారానే భర్తీ చేయాలని ఆ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూనియర్‌ అసిస్టెంట్ల వంటి పాలనాపరమైన పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు

Published : 23 Mar 2022 04:54 IST

వైద్యుల ఖాళీలు : సుమారు 4600, నర్సులు 4000
సీఎం ఆమోదానికి చేరిన దస్త్రం  

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలో ప్రకటించిన మొత్తం 12,755 పోస్టుల్లో వైద్యులు సహా నర్సులు, ఇతర సిబ్బందిని వైద్య నియామక సంస్థ ద్వారానే భర్తీ చేయాలని ఆ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూనియర్‌ అసిస్టెంట్ల వంటి పాలనాపరమైన పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామకాల్లో అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఒక ప్రముఖ సంస్థ నుంచి స్వీకరించాలని నిర్ణయించారు. మొత్తం ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఎంబీబీఎస్‌ అర్హత గల పోస్టులు సుమారు 1300 ఉండగా.. వైద్యవిధాన పరిషత్‌, వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని ఆసుపత్రుల్లో 3300 వరకు స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇవికాకుండా సుమారు 4000 నర్సుల పోస్టులు ఉన్నాయి. ఇంకా 1700 ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఇతర పాలనాపర ఖాళీలు భర్తీ చేయాలి. వీటిలో తొలుత వైద్యులు, నర్సుల పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. వైద్యుల పోస్టులను నేరుగా వారి అర్హత, అనుభవం, వెయిటేజీ ఆధారంగా తీసుకుంటారు. నర్సులు సహా మిగిలిన పోస్టులన్నింటికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రాతిపదికన ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి అనుభవం, వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని తుది నియామకాలు జరుపుతారు. ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికీ వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదించారు. వీరికి ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరోగ్యశాఖలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ ప్రతిపాదనల రూపంలో ఓ దస్త్రాన్ని రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటన్నింటిపై సీఎం వద్ద చర్చిస్తారు. ఆయన ఆమోదం అనంతరం తిరిగి ఆర్థికశాఖ వద్ద మరోసారి అనుమతులు పొంది, తర్వాత ఆరోగ్యశాఖలో ఖాళీలపై స్పష్టతతో కూడిన ఉత్తర్వులను వెలువరిస్తారని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జీవోలు వెల్లడైన తర్వాత నియామక ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని