హైదరాబాద్‌లో అదృశ్యమై.. 21 ఏళ్ల తర్వాత సొంతవారిని కలుసుకున్న మహిళ

మతిస్థిమితంలేక 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తెను తండ్రి చెంతకు చేర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. బుధవారం ఎస్పీ సి.హెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

Published : 07 Apr 2022 07:19 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేక 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తెను తండ్రి చెంతకు చేర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. బుధవారం ఎస్పీ సి.హెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన కట్ట నాగిశెట్టి, సత్యవతి దంపతులకు అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అయిదో కుమార్తె శ్రీదేవికి మతిస్థిమితం లేదు. కుటుంబమంతా 2001 మార్చిలో హైదరాబాద్‌ వెళ్లిన సందర్భంలో రైల్వేస్టేషన్‌లో శ్రీదేవి తప్పిపోయింది. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు. ఎంత గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో హైదరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చి సొంతూరికి చేరుకున్నారు. తర్వాత సత్యవతి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు చనిపోయారు. ప్రస్తుతం నాగిశెట్టి.. కర్నూలు మండలం దేవమడలోని తన మరో కుమార్తె శ్యామల, అల్లుడు నాగరాజు వద్ద ఉంటున్నాడు. అదృశ్యమైన శ్రీదేవి రైలు ఎక్కి గుజరాత్‌ రాష్ట్రానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లో తిరుగుతున్న ఆమెను ఇటీవల మదర్‌థెరెసా ట్రస్టు చేరదీసి వడోదరలోని పారుల్‌ సేవాశ్రమ్‌ వైద్యశాలలో చేర్పించింది. వారం క్రితం కోలుకున్న శ్రీదేవి తన వివరాలు చెప్పింది. ఆసుపత్రి వైద్యులు అలంపూర్‌లో వాకబు చేయగా నాగిశెట్టి దేవమడలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డిని సంప్రదించగా స్పెషల్‌బ్రాంచ్‌ ద్వారా నాగిశెట్టి చిరునామా గుర్తించారు. తండ్రి, అక్క శ్యామల, బావ నాగరాజు చిత్రాలు పంపి చూపడంతో శ్రీదేవి గుర్తుపట్టింది. కర్నూలు పోలీసుస్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేయించి ఈ నెల 1న దిశా ఎస్సై దానమ్మ సిబ్బందితోపాటు శ్యామల, నాగరాజులను వడోదరకు పంపారు. పారుల్‌ సేవాశ్రమ్‌వారు శ్రీదేవిని అప్పగించగా కర్నూలుకు తీసుకువచ్చారు. 75 ఏళ్ల వయసుకు చేరిన నాగిశెట్టి.. 21 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన కూతుర్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని