Cholesterol: కొలెస్ట్రాల్‌ తగ్గించే ఔషధాలతో దుష్ప్రభావాలు

కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలను దీర్ఘకాలం వినియోగించడం కణాల నిర్మాణంలో మార్పులకు దారితీస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ ఇలాంటివి గుర్తించినప్పటికీ పరమాణు స్థాయిలో ఇప్పటివరకు ఆధారాలు లభ్యం కాలేదని

Updated : 10 Apr 2022 08:46 IST

సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలను దీర్ఘకాలం వినియోగించడం కణాల నిర్మాణంలో మార్పులకు దారితీస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ ఇలాంటివి గుర్తించినప్పటికీ పరమాణు స్థాయిలో ఇప్పటివరకు ఆధారాలు లభ్యం కాలేదని, సీసీఎంబీ ఆచార్యులు చటోపాధ్యాయ బృందం కణ స్థాయిలో మార్పులను గుర్తించిందని శనివారం సీసీఎంబీ పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో స్టాటిన్స్‌ ఒకటి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి రోగులకు వీటిని అందిస్తుంటారు. కీలక ఎంజైమ్‌(హెచ్‌ఎంజీ-సీవోఏ)ను నిరోధించేలా ఇవి పనిచేస్తాయి. అయితే వాడకం ఎక్కువైనప్పుడు కణ నిర్మాణంలో మార్పులను అవి ఎలా ప్రేరేపిస్తాయో సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా కణం ఆక్టిన్‌ల వంటి ప్రోటీన్లతో తయారవుతుంది. ఆక్టిన్‌లు శరీరంలోని ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర కింద ఉంటాయి. కణాలు ఆకారాన్ని, పరిమాణాన్ని కల్గి ఉండటానికి అవి దోహదం చేస్తాయి. స్టాటిన్‌ ఔషధం రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు, కణ నిర్మాణానికి కీలకమైన ఆక్టిన్‌ ప్రొటీన్ల పాలిమరైజేషన్‌ను ప్రేరేపిస్తోంది. తద్వారా కణాల పరిమాణం, పనితీరులో మార్పులు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది’’ అని సీసీఎంబీ వెల్లడించింది. ఈ వివరాలు తాజాగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ నుంచి వెలువడే జర్నల్‌ ఆఫ్‌ లిపిడ్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైనట్టు పేర్కొంది. ‘కణ స్థాయిలో ఆక్టిన్‌, కొలెస్ట్రాల్‌ బయోసింథసిస్‌ మధ్య పరస్పర చర్య, స్టాటిన్‌ చికిత్స దుష్ప్రభావాలను పరమాణు ఆధారంగా అందజేసిన మొట్టమొదటి పరిశోధన మాదేనని’ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ పారిజాత్‌ సర్కార్‌ అన్నారు. స్టాటిన్స్‌ ప్రతికూల ప్రభావాలకు దారితీసే జీవ రసాయన ప్రక్రియలను అడ్డుకునేందుకు, భవిష్యత్తులో మెరుగైన ఔషధాలను అభివృద్ధి చేయడానికి తమ పరిశోధన దోహదం చేస్తుందని మరో పరిశోధకులు ఆచార్య చటోపాధ్యాయ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని