Telangana News: పరిహారం కోసం 56 ఏళ్లుగా పోరాటం

ఉమ్మడి ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో చెరువు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు.. పరిహారం కోసం 56 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి హైకోర్టు తెరదించింది.

Updated : 08 May 2022 08:31 IST

3 నెలల్లో చెల్లించాలని హైకోర్టు తీర్పు
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో చెరువు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు.. పరిహారం కోసం 56 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి హైకోర్టు తెరదించింది. రైతులకు ప్రత్యామ్నాయ భూమి లేక పరిహారం చెల్లించాలని గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. గ్రామంలో చెరువు నిర్మాణంతో ముంపునకు గురైన భూములకు ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని ఎం.హనుమంతు మరో ఏడుగురు రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. 1965లో భూమిని తీసుకున్నారు. పరిహారంపై రైతులు దాదాపు 28 ఏళ్లపాటు అధికారుల చుట్టూ తిరిగి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 1993లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి పరిహారం చెల్లించాలని 2004లో తీర్పు వెలువరించారు.  దీనిపై కలెక్టర్‌ తదితరులు అప్పీలు దాఖలు చేయడంపై తాజా విచారణలో ధర్మాసనం తప్పుపట్టింది. భూమిని ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందున పరిహారం ఇవ్వాల్సిన అవసరంలేదంటూ ప్రభుత్వం నిరాకరించే ప్రయత్నం చేసిందని పేర్కొంది. 1965లో భూమిని తీసుకున్నాక రైతులు 1993లో కోర్టుకు వచ్చారని, గడువు ముగిసిన కారణంగా పిటిషన్‌ను కొట్టివేయాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. నిరక్షరాశ్యులైన రైతులు ప్రత్యామ్నాయ భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ భూమిని ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూమి లేదంటే పరిహారం    పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను మూడు నెలల్లో అమలు చేయాలని తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని