Updated : 17 May 2022 10:35 IST

ఆస్తి ముద్దు.. అమ్మానాన్నలు వద్దు: వృద్ధులను బయటకు గెంటేసిన కుమారులు

ఈనాడు, కరీంనగర్‌: జీవితమంతా కష్టించి.. ఆస్తిని పంచిన తల్లిదండ్రులను వారి కుమారులు బయటకు వెళ్లగొట్టారు. గతిలేక ఆ వృద్ధులు సామాజిక భవనంలో కాలం వెళ్లదీస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం చెర్లబూత్కూర్‌ గ్రామానికి చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు అయిలయ్య (90), రావమ్మ(85). వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అయిలయ్య తన ఆరెకరాల భూమిని కుమారులకు పంచిపెట్టారు. ఇల్లు మూడో కుమారుడికి ఇస్తే, అతడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పక్కనే తల్లిదండ్రులకు చిన్న రేకులషెడ్డు నిర్మించారు. కొన్నాళ్లకు అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. వృద్ధాప్య పింఛనుతో జీవించేవారు. మూడు నెలల కిందట గ్రామ పెద్దలంతా చర్చించి.. దంపతులను కుమారులు ఒక్కొక్కరు నెల రోజుల చొప్పున చూడాలని నిర్ణయించారు. ఆ ప్రకారం వృద్ధులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు కుమారుల వద్ద నెల రోజుల చొప్పున గడిపారు. మూడో కుమారుడు వారిని రానీయలేదు. పెద్ద కుమారుడు తన ఇంటి నుంచి వారి సామగ్రిని బయట పడేయించాడు. దీంతో 20 రోజులుగా వారు స్థానిక సామాజిక భవనంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులను సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చి ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తగు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారును ఆదేశాంచారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని