KTR: నేటి నుంచి కేటీఆర్‌ విదేశీ పర్యటన.. దావోస్‌లో సదస్సుకూ హాజరు

తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ పది రోజుల విదేశీ పర్యటనకు మంగళవారం బయల్దేరుతున్నారు. ఉదయం పది గంటలకు ఆయన శంషాబాద్‌ అంతర్జాతీయ

Updated : 17 May 2022 06:46 IST

పెట్టుబడుల సాధనే లక్ష్యం
లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ పది రోజుల విదేశీ పర్యటనకు మంగళవారం బయల్దేరుతున్నారు. ఉదయం పది గంటలకు ఆయన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళతారు. అక్కడ మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఆయన స్విట్జర్లాండ్‌కు పయనమవుతారు. దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. దానికి హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశమవుతారు. 26న ఆయన రాష్ట్రానికి వస్తారు.  పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇతర అధికారుల బృందం పర్యటనలో పాల్గొంటుంది.

ఆ రోజు వాగ్దానమేమైంది.. మోదీని ప్రశ్నించిన కేటీఆర్‌

‘‘మోదీజీ సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున మంచిరోజులు వస్తున్నాయి (అచ్చేదిన్‌ ఆనేవాలే హై) అంటూ హామీ ఇచ్చారు. కానీ మీ ప్రభుత్వం ఏం సాధించిందో తెలుసా?..మీ హయాంలో రూపాయి విలువ 77.80 పైసల కనిష్ఠానికి తగ్గింది. గత 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగిత...గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ద్రవ్యోల్బణంతో పాటు అత్యంత అధ్వానమైన ఆర్థిక వ్యవస్థను తెచ్చింది’’ అని కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. 2014 మే 16న భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేశారు. చాలా బాగా చేశారు మోదీజీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


శ్రీజకు అన్ని విధాలా సహకరిస్తాం  

ర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్‌క్రీడల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించనున్న తెలంగాణ టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కామన్‌వెల్త్‌క్రీడల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం శ్రీజ ప్రగతిభవన్‌లో తమ కోచ్‌తో కేటీఆర్‌ను కలిసింది. రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, కోచ్‌ సోమనాథ్‌ ఘోష్‌ను కేటీఆర్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని