Updated : 19 May 2022 06:09 IST

సంక్షిప్త వార్తలు

తడిసిన ధాన్యాన్ని కొనాలి: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని, ప్రభుత్వ పథకాల అమల్లో చురుగ్గా ఉండాలని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన వారితో సమీక్ష జరిపారు. దళితబంధు, ధాన్యం సేకరణ, హరితహారం, గ్రామీణ క్రీడా ప్రాంగణం, ఆహార శుద్ధి జోన్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.


పాల సేకరణ ధర పెంచకుంటే విజయ డెయిరీ మనుగడ కష్టం

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి పాల సేకరణకు చెల్లించే ధరలు పెంచకపోతే ప్రైవేటు డెయిరీలతో పోటీపడి విజయ డెయిరీ నెగ్గుకురాలేదని రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంఘం నేత సోమిరెడ్డి పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హాకు ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టం చేశారు. పశువుల దాణా, గడ్డి ధరలు విపరీతంగా పెరిగినందున పాడి పశువుల నిర్వహణ భారంగా మారిందని, ప్రస్తుతం విజయ డెయిరీ ఇచ్చే ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదని ఆయన తెలిపారు. ప్రైవేటు డెయిరీలతో సమానంగా ధర చెల్లించాలని ఆయన కోరారు. 50 శాతం రాయితీపై దాణా సరఫరా చేయాలన్నారు. పాడి పశువు కొంటే రూ.10 వేల రాయితీ ఇస్తామన్న హామీని నిలబెట్టుకుని సొమ్ము పంపిణీ చేయాలన్నారు.


రేషన్‌ డీలర్ల కమీషన్‌ పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: చౌకధరల దుకాణదారులకు ఇస్తున్న కమీషన్‌ను కేంద్రం పెంచింది. ప్రస్తుతం క్వింటా నిత్యావసరాలు పంపిణీ చేస్తే డీలర్లకు కేంద్రం రూ.70ను కమీషన్‌ రూపంలో చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రూ.90కు పెంచాలని నిర్ణయించింది.


పదోన్నతుల కాలపట్టిక విడుదల చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం సర్వీస్‌ నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కాలపట్టికను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.


‘రూ. 850 కోట్లు తక్షణం చెల్లించండి’

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సొసైటీ(సీసీఎస్‌)కి యాజమాన్యం చెల్లించాల్సిన రూ.850 కోట్లు తక్షణం చెల్లించాలన్న తీర్మానాన్ని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పాలకవర్గ సమావేశం ఆమోదించింది. కొంత కాలంగా ఉద్యోగుల జీతం నుంచి పొదుపు మొత్తాన్ని తగ్గిస్తున్నప్పటికీ సొసైటీకి చెల్లించకపోవటంతో ఆ మొత్తం పేరుకుపోయింది. ప్రస్తుతం చెల్లించాల్సిన రూ.850 కోట్లలో రూ.600 కోట్లు అసలు కాగా మిగిలినది వడ్డీ అని సొసైటీ ఒక ప్రకటనలో పేర్కొంది.


పురపాలికలకు అవార్డులు హర్షణీయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలికలు జాతీయస్థాయిలో పలు అవార్డులు సాధించడం హర్షణీయమని తెలంగాణ మున్సిపల్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు రాజు వెన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ పట్టణ ప్రగతి అవార్డులు పొందిన సూర్యాపేట, షాద్‌నగర్‌, కల్వకుర్తి, బాన్సువాడ, శంషాబాద్‌, సంగారెడ్డి, ఇల్లెందు, తూప్రాన్‌, అలంపూర్‌, ఇబ్రహీంపట్నం, భూత్పూర్‌ పురపాలక సంఘాల ఛైర్మన్లను బుధవారం హైదరాబాద్‌లోని ఛాంబర్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణీకరణకు అనుగుణంగా వసతులను కల్పించడంలో పురపాలక సంఘాల ఛైర్మన్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.


జూన్‌ 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌మీడియట్‌ సీట్ల భర్తీకి జూన్‌ 6వ తేదీన టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ జరగనుంది. ఆ రోజు ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు సిద్దిపేట, సంగారెడ్డిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుపుతామని కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. మొత్తం 40,281 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను ఈ నెల 28వ తేదీ నుంచి www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని