TG News: గుండెకు గండం!

ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో గుండె సంబంధిత అత్యవసర పరీక్షలు నిలిచిపోయాయి. అత్యాధునిక యంత్రాలున్నా టెక్నీషియన్లు లేక 2డి ఎకో పరీక్షలు చేయడం లేదు.

Published : 11 Jul 2024 03:29 IST

ఎంజీఎంలో ఆగిన పరీక్షలు
2డి ఎకో సేవలకు కేఎంసీకి తరలింపు

2డి ఎకో పరీక్ష కోసం ఎంజీఎం నుంచి వచ్చిన రోగులను స్ట్రెచర్‌పై ఉంచి నిరీక్షిస్తున్న సహాయకులు 

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో గుండె సంబంధిత అత్యవసర పరీక్షలు నిలిచిపోయాయి. అత్యాధునిక యంత్రాలున్నా టెక్నీషియన్లు లేక 2డి ఎకో పరీక్షలు చేయడం లేదు. ఫలితంగా అత్యవసర రోగులు, శస్త్రచికిత్స అవసరమైన రోగులను 2డి ఎకో పరీక్షల కోసం కేఎంసీ (కాకతీయ మెడికల్‌ కాలేజీ) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సర్జరీకి ముందు, మెడికల్‌ కేసుల్లో చికిత్సకు ముందు గుండె వైద్యుడి సలహా కోసం 2డి ఎకో పరీక్ష అత్యవసరం. అలాంటి వారు 50 మందిని బుధవారం ఎంజీఎం ఆసుపత్రి నుంచి కేఎంసీలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి స్థానిక ఎంజీఎం అంబులెన్సులో తీసుకెళ్లారు. అప్పటికే కేఎంసీలోని కార్డియాలజీ ఓపీ సేవల కోసం వందల మంది రోగులు వరసలో ఉన్నారు. ఒక యంత్రంపై ఎంజీఎం నుంచి వెళ్లిన రోగులందరికీ 2డి ఎకో పరీక్షలు చేయడం సాధ్యం కాదని కేఎంసీ వైద్యులు తేల్చిచెప్పారు. రోగుల విజ్ఞప్తిమేరకు ఎంజీఎం నుంచి వచ్చిన 50 మందికి పరీక్షలు చేయడంతో పాటు, కార్డియాలజీ ఓపీకి వచ్చిన రోగుల్లో 100 మందికి అతికష్టం మీద పరీక్షలు చేశారు. ఎంజీఎం నుంచి 2డి ఎకో పరీక్షల కోసం రావడానికి సిద్ధమైన మరో 30 మంది రోగులను కేఎంసీలోనే ఆపేశారు. దీంతో బుధవారం జరగాల్సిన శస్త్రచికిత్సలను గురువారానికి వాయిదా వేశారు. ఈ విషయంపై ఆర్‌ఎంఓ-3 శ్రీనివాస్‌ వివరణ కోరగా.. ఈ రోజు జరిగిన ఘటన తన దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని