Roads: 4,417 కిలోమీటర్లు.. తక్షణం మరమ్మతులు చేయాల్సిన రోడ్ల పొడవు ఇది

రాష్ట్రంలో తక్షణం 4,417 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేయాలని రహదారులు, భవనాల శాఖ నివేదించింది. వర్షాలు ముమ్మరం అయ్యేలోగా చేయకపోతే అవి మరింతగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Published : 26 Jun 2024 04:10 IST

రూ.1,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా
దెబ్బతిన్న రహదారులను గుర్తించిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు 
నిధుల విడుదల జీవో తరువాత టెండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తక్షణం 4,417 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేయాలని రహదారులు, భవనాల శాఖ నివేదించింది. వర్షాలు ముమ్మరం అయ్యేలోగా చేయకపోతే అవి మరింతగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. రహదారుల పరిస్థితులపై అధ్యయనం చేసి అత్యవసరంగా ఎన్ని కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయించాల్సి ఉందో గుర్తించాల్సిందిగా రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖకు 16 సర్కిళ్లలో స్టేట్‌ రోడ్స్‌ కింద 28,730 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు అందులో నాలుగు వేలకుపైగా కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, తక్షణం మరమ్మతులు చేపట్టాలని మంత్రికి నివేదిక ఇచ్చారు. ఇటీవల ఆయన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించారు. పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల చేయిస్తానని చెప్పారు. నిధుల విడుదల జీవో వచ్చాక టెండర్లు ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

గుత్తేదారులు ముందుకొచ్చేనా.. 

గుర్తించిన రహదారుల తక్షణ పునరుద్ధరణకు రూ.1,700 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. నల్గొండ ఆర్‌ అండ్‌ బీ సర్కిల్‌ పరిధిలో మరమ్మతుల కోసం అత్యధికంగా రూ.173 కోట్లు అవసరమని గుర్తించారు. అతి తక్కువగా జయశంకర్‌ భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో రూ.23 కోట్లు కావాలని పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.105 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు రూపొందించారు. గతంలో వర్షాలు కురిసిన సమయంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయించేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవటంతో అధికారులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటంతో టెండర్ల దాఖలుకు గుత్తేదారులు ముందుకు రాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరవాత చిన్న చిన్న గుత్తేదారులకు నిధులు విడుదల చేశారు. అయినా ఇప్పటికీ బకాయిలు ఉన్నట్లు సమాచారం. నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పక్షంలో గుత్తేదారులు ఎంత మేరకు ముందుకు వస్తారో చూడాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని