ICET Results: ఐసెట్‌లో ఉత్తీర్ణులు 71,647 మంది

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌లో ఏకంగా 91.92% మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 86,156 మంది దరఖాస్తు చేసుకుని, 77,942 మంది పరీక్ష రాశారు.

Updated : 15 Jun 2024 04:12 IST

అర్హత సాధించిన వారిలో అమ్మాయిలే అధికం
అందుబాటులో దాదాపు 45 వేల ఎంబీఏ, ఎంసీఏ సీట్లు

ఐసెట్‌ ఫలితాల సీడీని ఆవిష్కరిస్తున్న శ్రీరాం వెంకటేశ్, మహమూద్, లింబాద్రి, వాకాటి కరుణ, వెంకటరమణ, నర్సింహాచారి 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌లో ఏకంగా 91.92% మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 86,156 మంది దరఖాస్తు చేసుకుని, 77,942 మంది పరీక్ష రాశారు. వారిలో 71,647 మంది పాసయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి వాకాటి కరుణ, కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.నర్సింహాచారి తదితరులు శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. తొలి 10 ర్యాంకర్లలో అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా ఉన్నారు. 5, 7 ర్యాంకులను ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ర్యాంకర్లలో ఆరుగురు హైదరాబాద్, చుట్టుపక్కల వారే కావడం విశేషం. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ... గత విద్యా సంవత్సరం 272 ఎంబీఏ కళాశాలల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కళాశాలల్లో 6,990 సీట్లు... మొత్తం 42,939 సీట్లున్నాయని, ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. కనీసం 45 వేలకు చేరుకోవచ్చని తెలిపారు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తామని, ఈలోపు అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు వెంకట రమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు