Amaravati: సర్కారుకు కిం కర్తవ్యం?

మూడు రాజధానులు కుదరవని, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టమైన తీర్పునివ్వడంతో పాటు, రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని తు.చ. తప్పక అమలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో...

Updated : 04 Mar 2022 05:37 IST

పనులకు గుత్తేదారులు ముందుకొస్తారా..
ఎల్‌పీఎస్‌ లే అవుట్‌ పనులు నెలలో పూర్తయ్యేనా?

ఈనాడు, అమరావతి: మూడు రాజధానులు కుదరవని, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టమైన తీర్పునివ్వడంతో పాటు, రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని తు.చ. తప్పక అమలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో... దాని పర్యవసానాలు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మార్గాలేంటన్న అంశాలపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రైతులతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న 9.14 ఒప్పందం ప్రకారం, వారికిచ్చిన హామీల అమలుపై హైకోర్టు గడువులు నిర్దేశించింది. రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతులు, మూడు నెలల్లో ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లు అభివృద్ధి పూర్తిచేసి రైతులకు స్థలాలు అప్పగించాలని, రాజధాని నగర నిర్మాణం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధి ఆరు నెలల్లో పూర్తి చేయాలనడంతో పాటు, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు చెప్పిన గడువులోగా పనులు పూర్తి చేయాలంటే సీఆర్‌డీఏ వెంటనే రంగంలోకి దిగాలి. అప్పట్లో చేసిన పనులకు ఇంకా కొందరు గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. ఆ బిల్లులు ఇవ్వకుండా వారు మళ్లీ పనులు చేపట్టేందుకు ముందుకు వస్తారా? అన్నదీ సందేహమే.

* ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌ పనులను గతంలో 16 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. వాటిలో వైకాపా ప్రభుత్వం వచ్చి పనులు నిలిపివేసే సమయానికి సగటున 4.45% పనులే జరిగాయి. ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు అడవుల్ని తలపిస్తున్నాయి. వాటిలో పిచ్చిమొక్కలు తొలగించి, హద్దులు సరిచేసేందుకే కనీసం నెల రోజులైనా పడుతుంది. హైకోర్టు చెప్పినట్టు నెల రోజుల్లో పనులను ఎలా పూర్తిచేస్తారో చూడాల్సి ఉంది.

* నిధుల సమీకరణ పెద్ద సమస్య. బ్యాంకులు, హడ్కో వంటి సంస్థలు రుణం ఇస్తే తప్ప ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు రాజధానికి ప్రభుత్వం నిధులు ఎలా సమీకరిస్తుందన్నది మరో పెద్ద ప్రశ్న.

అమరావతి మాస్టర్‌ప్లాన్‌కే కట్టుబడాలని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో... ప్రభుత్వం ఇక దానిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని