Aryan Khan: ఆర్యన్‌కు బెయిలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు,

Updated : 29 Oct 2021 05:22 IST

ఫలించిన షారుక్‌ తనయుడి నిరీక్షణ
డ్రగ్స్‌ కేసులో బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట
నేడో రేపో విడుదలయ్యే అవకాశం
అర్బాజ్‌, మున్మున్‌లకూ బెయిలు మంజూరు

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు, వివాదాలతో ముందుకు సాగుతున్న ఈ కేసులో ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ ధమేచలకు బాంబే హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఇప్పటికే 25 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్‌.. కోర్టు ఆదేశాల ప్రకారం లాంఛనాలన్నీ పూర్తిచేశాక శుక్రవారం లేదా శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. తాజా పరిణామంతో షారుక్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముంబయి తీరంలోని నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించి ఆర్యన్‌ సహా మొత్తం 20 మందిని ఎన్‌సీబీ ఈ నెల 3న అరెస్టు చేసింది. షారుక్‌ కుమారుడు ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ కారాగారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఆర్యన్‌, అర్బాజ్‌, మున్మున్‌ల బెయిలు పిటిషన్లపై జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ.సంబ్రే నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. తొలుత ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. 23 ఏళ్ల ఆర్యన్‌ గతంలో వాణిజ్య వినియోగ స్థాయిలో డ్రగ్స్‌ను సమీకరించినట్లు ఏ ప్రాతిపదికన చెబుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన వాట్సప్‌ చాట్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సింగ్‌ పేర్కొన్నారు. నిందితుడి ఫోన్‌ నుంచి ఎన్‌సీబీ ఈ మేరకు ఆధారాలు సంపాదించిందన్నారు. నౌకలో 11 మంది మాదకద్రవ్యాలను వాడనున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం అందిందని, వారిలో 8 మంది వద్ద డ్రగ్స్‌ దొరికాయని చెప్పారు. అర్బాజ్‌ వద్ద ఉన్న డ్రగ్స్‌నే ఆర్యన్‌ నౌకలో తీసుకుని ఉండేవారని పేర్కొన్నారు. వారిద్దరికీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్నాయని బలంగా వాదించారు. ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ వినియోగిస్తుంటారన్నారు. ప్రస్తుతం ఆయన విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే ముప్పుందని చెప్పారు. తమ అరెస్టు అక్రమమని నిందితులు ఇప్పుడు వాదించడంలో అర్థం లేదన్నారు. మేజిస్ట్రేటు కోర్టు ఇంతకుముందు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించినప్పుడే దానిపై వారు సవాలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘డ్రై డే’గా పాటించే అక్టోబరు 2న నిందితులు ఇలాంటి విహార విందును ఏర్పాటుచేసుకోవాల్సింది కాదంటూ సింగ్‌ కాస్త చమత్కారంతో వ్యాఖ్యానించారు.

పూచీకత్తు ఉండాల్సిందే

అనంతరం ఆర్యన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తిరిగి వాదనలను వినిపించారు. నౌకలో ఉన్నవారిలో అర్బాజ్‌ తప్ప ఇతరులెవరూ ఆర్యన్‌కు తెలియదని చెప్పారు. డ్రగ్స్‌కు సంబంధించిన కుట్రలో ఆయన పాత్ర ఉన్నట్టు నిరూపించే సాక్ష్యాధారమేదీ లేదన్నారు. ఆపై జస్టిస్‌ సంబ్రే మధ్యలో కలుగజేసుకొని.. ‘‘ముగ్గురికీ బెయిలు మంజూరు చేస్తున్నా. సమగ్ర ఉత్తర్వులను రేపు (శుక్రవారం) సాయంత్రానికల్లా జారీ చేస్తా’’ అని పేర్కొన్నారు. డబ్బు చెల్లించి బెయిలు (క్యాష్‌ బెయిల్‌) తీసుకునేందుకు ఆర్యన్‌ తరఫు న్యాయవాదులు అనుమతి కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. పూచీకత్తు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బెయిలు మంజూరుకు షరతులను వివరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక, ఆ లాంఛనాలను పూర్తిచేస్తే.. ఆర్యన్‌ విడుదలవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని