Assembly Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు ప్రీఫైనల్‌!

ఈ నెల 10న వెల్లడి కానున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్కడి ముఖ్యమంత్రుల భవితవ్యాన్నే కాదు.. తదుపరి రాష్ట్రపతిని నిర్ణయించడంలోనూ అత్యంత కీలకం కానున్నాయి. జులై 24తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుంది.

Updated : 07 Mar 2022 05:06 IST

5 రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ
తదుపరి రాష్ట్రపతిని నిర్ణయించడంలో అవే కీలకం
యూపీలో భాజపా ఓడితే ఎన్డీయేకు ఎదురీతే

దిల్లీ: ఈ నెల 10న వెల్లడి కానున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్కడి ముఖ్యమంత్రుల భవితవ్యాన్నే కాదు.. తదుపరి రాష్ట్రపతిని నిర్ణయించడంలోనూ అత్యంత కీలకం కానున్నాయి. జులై 24తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుంది. దీంతో ఇటు భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి, అటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి ఎన్నికల్లో సత్తా చాటడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ విజయం సాధించే పార్టీల మెజార్టీని బట్టే రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. దేశ ప్రథమ పౌరుడి పదవికి జరిగే పరోక్ష ఎన్నికల్లో ఓట్ల సంఖ్య కన్నా ఓటు విలువ ముఖ్యభూమిక పోషిస్తుండడమే అందుకు కారణం. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నికైన ఎంపీలు, అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోని(దిల్లీ, పుదుచ్చేరి) శాసనసభ్యులు ఉంటారు. ఆయా సభలకు నామినేట్‌ అయినవారు, ఎమ్మెల్సీలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు.  

భాజపాకు ఇతరుల సాయం తప్పనిసరి!

ప్రస్తుతం పార్లమెంటు, శాసనసభల్లో ఎన్డీయే కూటమికి ఉన్న ప్రజాప్రతినిధుల సంఖ్యను బట్టి వారి మొత్తం ఓటు విలువ 50 శాతానికి కాస్త తక్కువగానే ఉంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. అయితే భాజపా అధికారంలో ఉన్న యూపీలో అనూహ్య ఫలితాలు వచ్చి భారీ సీట్ల తేడాతో ఆ పార్టీ ఓడిపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. అప్పుడు తమ కూటమి అభ్యర్థి సునాయాస విజయం సాధించాలంటే ఇతర పార్టీల సాయం తప్పనిసరి కానుంది. అలాంటి పరిస్థితే వస్తే ఎంపీల బలం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న బిజూ జనతాదళ్‌, టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల పాత్ర కీలకం కానుంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భాజపా వ్యతిరేక కూటమి కోసం ఇతర పార్టీలను కలుపుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. కేసీఆర్‌తో కలసి నడిచే యోచనలో ఉన్న పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రతిపక్ష కూటమి కూడా ఎన్డీయేలో చీలిక తెచ్చే యత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఎన్డీయేలో భాగస్వామి అయిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ను తమ ఉమ్మడి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు పావులు కదుపుతోంది. అదే జరిగితే భాజపాకు రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటు విలువే అత్యధికం

ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ ఆయా రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. 1971 జనాభా లెక్కలను అనుసరించి దామాషా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల్లోని జనాభా, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి దాన్ని నిర్ణయించారు. దీని ప్రకారం ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువను చూస్తే.. యూపీ(208) గరిష్ఠం కాగా ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్‌(116), ఉత్తరాఖండ్‌(64), గోవా(20), మణిపుర్‌(18) ఉన్నాయి. వీటిని ఆ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే సీట్ల సంఖ్యతో గుణించితే మొత్తం శాసన సభ ఓటు విలువ వస్తుంది. ఆ విషయంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా గరిష్ఠంగా 403 సీట్లున్న యూపీ ముందు వరుసలో ఉంది. యూపీ అసెంబ్లీ మొత్తం ఓటు విలువ 83,824 కాగా పంజాబ్‌(13,572), ఉత్తరాఖండ్‌(4480), గోవా(800), మణిపుర్‌(1080) ఓటు విలువను కలిగి ఉన్నాయి. దీంతో యూపీలో ఏ పార్టీ ఎన్ని సీట్ల ఆధిక్యంతో గెలుస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు