BJP Meeting: అయిదు రాష్ట్రాల్లోనూ మనదే గెలుపు

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 24 Sep 2022 15:37 IST

ప్రజలతో మమేకం కండి

నమ్మకమైన వారధిలా పనిచేయండి

భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం

ప్రధానిని ప్రశంసిస్తూ కార్యవర్గం తీర్మానం


ప్రధాని మోదీని సత్కరిస్తున్న పార్టీ నేతలు జేపీ నడ్డా, పీయూష్‌ గోయల్‌. పక్కన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గం సమావేశం ముగింపు సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు-పార్టీకి మధ్య నమ్మకమైన వారధిలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.  కేంద్రంలో పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం... ప్రజలతో కలిసి పనిచేయడమేనని చెప్పారు. సేవ, సంకల్పం, నిబద్ధత అనే విలువలపై ఆధారపడి భాజపా పనిచేస్తోందని, మిగతా పార్టీల్లా కుటుంబం చుట్టూ తిరగదని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును భాజపా జాతీయ కార్యవర్గం ప్రశంసించింది. 100 కోట్ల టీకాలు దాటడం, 80 కోట్ల ప్రజలకు ఉచితంగా ఆహారం అందించడం.. తదితర అంశాలు ప్రధాని నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అభిప్రాయపడింది. మోదీని, ఇటీవల భాజపా సాధించిన విజయాలను పొందుపరుస్తూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మద్దతుగా పలువురు ప్రసంగించారు. ఈ తీర్మానం ప్రతిపక్షాలపైనా విమర్శలు చేసింది. కరోనా సమయంలో అవకాశవాద రాజకీయాలకు విపక్షాలు పాల్పడ్డాయని, ట్విటర్‌ ద్వారా అపోహలు రేకెత్తించే ప్రయత్నం చేశాయని ఆరోపించింది. బెంగాల్‌లో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న హింసపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో భాజపా ప్రదర్శనను ఈ తీర్మానం శ్లాఘించింది. కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, పీ‡యూష్‌ గోయల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌..ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భాజపా సీనియర్‌ నేతలు ఎల్‌.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు వర్చువల్‌గా హాజరయ్యారు. 

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా


గజమాలతో మోదీకి సన్మానం

జాతీయ కార్యనిర్వాహక వర్గం మోదీని గజమాలతో సత్కరించింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును నేతలు కొనియాడారు. అంతకుముందు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. సమకాలీన భారత రాజకీయాల్లో ఈ స్థాయిలో ఓ రాజకీయ పార్టీ ఎదగడం అరుదని పేర్కొన్నారు. భాజపా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉందని అన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశాల్లో కూడా భాజపా విస్తరిస్తోందని పేర్కొన్నారు. పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో సిక్కు ఓటర్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సేవలను కూడా నడ్డా ప్రస్తావించారు. రూ.120 కోట్లతో కర్తార్‌సింగ్‌ నడవాను ప్రభుత్వం పూర్తి చేసిందని, 1984 నాటి అల్లర్లపై దర్యాప్తును కూడా కేంద్రం వేగవంతం చేసిందని పేర్కొన్నారు.


చర్చ.. ఎన్నికల రాష్ట్రాలపైనే..

జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల(ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా, ఉత్తరాఖండ్‌) ఎన్నికలపైనే చర్చ జరిగింది. ఈ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ, ఇతర సీనియర్‌ నాయకులు దిశానిర్దేశం చేశారు. కొవిడ్‌, జమ్మూకశ్మీర్‌ పరిస్థితి.. తదితర అంశాలపైనా చర్చ జరిగింది. పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 25కల్లా దేశవ్యాప్తంగా ఉన్న 10.40 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఓటర్ల జాబితాలోని పేజీకో వ్యక్తిని బాధ్యుడిగా నియమిస్తూ గుజరాత్‌లో చేసిన ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. బూత్‌కమిటీ స్థాయిలో మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం వినేలా చర్యల చేపట్టాలని నాయకులు తీర్మానించారు. త్వరలో శాసనసభ ఎన్నికలకు వెళుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంజాబ్‌ పార్టీ అధ్యక్షుడు ఈ సందర్భంగా తమ నివేదికలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని