Bathukamma: రాష్ట్రానికి బతుకమ్మ కళ

రవీంద్రభార[తి, నారాయణగూడ, హనుమకొండ, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలచే బతుకమ్మ సంబురాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 07 Oct 2021 10:32 IST

ఘనంగా ఉత్సవాలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌; రవీంద్రభార[తి, నారాయణగూడ, హనుమకొండ, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలచే బతుకమ్మ సంబురాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరాలు, పల్లెలు, పట్టణాలు పండగ కళ సంతరించుకున్నాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ వేయిస్తంభాల గుడిలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఉత్సవాలను ప్రారంభించారు. రాజ్‌భవన్‌లో ఘనంగా సంబురాలు నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై, ఆమె కుటుంబ సభ్యులు, రాజ్‌ భవన్‌ మహిళా ఉద్యోగులు పాలుపంచుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఉత్సవాలు జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, తెరాస మహిళానేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గన్‌పార్క్‌ వద్ద బహుజన బతుకమ్మ వేడుకలు జరిగాయి.


గన్‌పార్క్‌ వద్ద...

ప్రకృతి వ్యవసాయంతోనే బతుకమ్మకు సద్దులంటూ ‘బహుజన బతుకమ్మ’ను నిరంతర ఉద్యమంగా కొనసాగిద్దామని నిర్వహణ కమిటీ తెలంగాణ సారథి విమలక్క పిలుపునిచ్చారు. గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విమలక్క బతుకమ్మను ఎత్తుకొని తోటి కళాకారులతో వచ్చారు. దేశం, రాష్ట్రంలోని ప్రతి రైతు తన కుటుంబ అవసరాల మేరకైనా ప్రకృతి సాగు పద్ధతులకు మరలాలని కోరారు. ‘పాడి-పంట-పెంట’ విధానాలను పునరుద్ధరించుకోవాలన్నారు.


ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి : శ్రీనివాస్‌గౌడ్‌

‘తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి ఇదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం-సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బతుకమ్మ సంబురాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈనెల 13 వరకు అన్ని జిల్లాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్లను కోరినట్లు చెప్పారు. ‘రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించుకోలేకపోయాం.. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చింది.అందుకే ఉత్సవాలకు శ్రీకారం చుట్టాం. రవీంద్రభారతిలో చివరి రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించే ఉత్సవానికి గవర్నర్‌ తమిళిసైని ఆహ్వానిస్తాం. గతంలోలా వేలాదిమందితో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేసే విషయమై వైద్యాధికారులతో కలిసి యోచిస్తాం. రాష్ట్రంలో మహిళలకు పూర్తి రక్షణను కల్పించే చర్యలు చేపడుతున్నాం’ అని మంత్రి తెలిపారు.


కరోనా నిబంధనలు పాటించాలి

‘రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా పాల్గొన్నాను. ఈ ఏడాది మా తల్లిని కోల్పోయాను. పండుగలు అన్నీ ఘనంగా జరుపుకోవాలనేది ఆమె కోరిక. ఆ మేరకు రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఈ వేడుకలు నిర్వహించుకోవాలి’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని