Updated : 04 Mar 2022 05:34 IST

CM KCR: సుబ్రహ్మణ్యస్వామి, టికాయిత్‌లతో కేసీఆర్‌ భేటీ

నేడు రాంచీకి ప్రయాణం  
హేమంత్‌ సోరెన్‌తో భేటీ

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ టికాయిత్‌తో గురువారం భేటీ అయ్యారు. దిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాససానికి వచ్చిన వారికి సీఎం కేసీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ స్వాగతం పలికారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్‌ సమకాలీన రాజకీయాలపై చర్చించారు. దేశంలోని ఆర్థిక, రాజకీయ వ్యవహారాలతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రక్షణ అంశాలపైనా కేసీఆర్‌తో చర్చించినట్లు సమావేశం అనంతరం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. తనకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నారని చెప్పారు. 2016లో రాజ్యసభకు నామినేట్‌ అయిన సుబ్రహ్మణ్యస్వామి ఇటీవలి కాలంలో తరచూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాకేష్‌ టికాయిత్‌, బీకేయూ నాయకులతో సాయంత్రం 4.30 గంటల వరకు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, తదితర అంశాలను టికాయిత్‌ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. అనంతరం తెలంగాణలో రైతులకు అండగా నిలుస్తున్న తీరును ముఖ్యమంత్రి వారికి వివరించారు.

ప్రజాఫ్రంట్‌ అవసరమే: రాకేష్‌ టికాయిత్‌

‘నేను రాజకీయాలకు సంబంధం లేని మనిషిని. రాజకీయేతర అంశాలే కేసీఆర్‌తో చర్చించాం. వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానాలను పరిశీలిస్తున్నాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ వాటిపైనే చర్చిస్తున్నాం’ అని బీకేయూ నేత రాకేష్‌ టికాయిత్‌ అనంతరం విలేకరులతో అన్నారు. ‘‘రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాల జాబితాను సీఎం కేసీఆర్‌కు ఈ నెల 10 వరకు అందజేస్తాం. చనిపోయిన రైతుల్లో వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉండడం వల్ల వివరాల సేకరణ ఆలస్యమైంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్‌ విధానాలు బాగున్నాయి. వాటిని దేశమంతటా అమలు చేయాలి. వచ్చే ఏడాది అంతర్జాతీయ కిసాన్‌ సమ్మేళనం నిర్వహించాలనుకుంటున్నాం. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఎక్కడ నిర్వహిస్తారని కేసీఆర్‌ అడిగారు.. వేదిక నిర్ణయించలేదని చెప్పగా, హైదరాబాద్‌లో పెట్టుకోవాలని సూచించారు. రాజకీయాల్లోనూ పోటీ ఉండాలి.. ప్రజాఫ్రంట్‌ రావాల్సి ఉంది’’ అని టికాయిత్‌ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాపై వ్యతిరేకత ఉందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

నేడు ఝార్ఖండ్‌ సీఎంతో చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ కానున్నారు. భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్న ఆయన తాజాగా హేమంత్‌ సొరేన్‌ను కలవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. జేఎంఎం అధ్యక్షుడైన హేమంత్‌ సొరేన్‌ 2018 మార్చిలో కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు.

అమర జవాన్ల కుటుంబాలకు సాయం

రాంచీలోని ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు  కేసీఆర్‌ రూ. పదేసి లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. 2020 జూన్‌లో సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా మరో 19 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో ఝార్ఖండ్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. శుక్రవారం రాంచీలో వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌తో కలిసి పరిహారం అందించనున్నారు.  మిగిలిన జవాన్ల కుటుంబాలకు 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పరిహారం పంపిణీ చేస్తారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని