CM KCR: ప్రత్యామ్నాయంపై త్వరలో స్పష్టత

దేశాన్ని గాడిలో పెట్టి సరైన దిశలో నడిపేందుకు గట్టి ప్రయత్నం మొదలైందని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే తామంతా కలిసి ఏ ఎజెండాతో, ఎలా ముందుకు వెళ్లాలో, దేశాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహం ఖరారు చేస్తామన్నారు

Updated : 05 Mar 2022 05:49 IST

దేశానికి సరైన దిశ చూపేలా గట్టి ప్రయత్నం  
 ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ
ప్రాంతీయ పార్టీల సత్తా చూపుదామన్న సోరెన్‌



దేశానికి స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలైనా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ప్రపంచదేశాలతో పోలిస్తే చాలా విషయాల్లో మనం వెనకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు ప్రగతిని సాధించినా భారత్‌లో అది కనిపించడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశాన్ని సరైన పంథాలో నడిపించడం లేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉంది.

- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  


ఈనాడు, హైదరాబాద్‌: దేశాన్ని గాడిలో పెట్టి సరైన దిశలో నడిపేందుకు గట్టి ప్రయత్నం మొదలైందని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే తామంతా కలిసి ఏ ఎజెండాతో, ఎలా ముందుకు వెళ్లాలో, దేశాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహం ఖరారు చేస్తామన్నారు. భాజపా, కాంగ్రెస్‌ వ్యతిరేక ఫ్రంట్‌, మూడో ఫ్రంట్‌, నాలుగో ఫ్రంట్‌ లాంటివి ఖరారు కాలేదని, ఇప్పుడే తొందరపడి ఏ పేరూ పెట్టవద్దన్నారు. ఝూర్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌తో కలిసి కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మేమిద్దరం జాతీయ రాజకీయాలపై చర్చించాం. చర్చలు ఫలప్రదమయ్యాయి. త్వరలోనే మరోసారి కలిసే అవకాశం ఉంది. పురోగామి భారత్‌ను నిర్మించడంలో అందరి పాత్రను కోరుతున్నాం. ప్రస్తుతమున్నదాని కంటే ఎన్నోరెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలనేదే మా ఆకాంక్ష. దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలుస్తున్నాం. ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో అయ్యే పని కూడా కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరుకుతుంది. ఏ దారిలో వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలా లేక మరోటా అనే విషయాన్ని మున్ముందు తెలియజేస్తాం. స్వచ్ఛమైన మంచి మనసుతో చెబుతున్నాం. ప్రస్తుతం ఉన్న భారత్‌ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలన్నదే మా ఆకాంక్ష’’ అన్నారు.

ప్రాంతీయ పార్టీల సత్తా చాటుదాం: కేసీఆర్‌  
ఇద్దరు సీఎంలు దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా వ్యతిరేక కూటమి రూపకల్పన వంటి అంశాలపై చర్చించారు. భాజపాయేతర రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు ఏడున్నరేళ్లుగా ఎలాంటి సాయం చేయడం లేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. ‘‘రైల్వేలోనూ సహాయ నిరాకరణ చేస్తోంది. కరోనా టీకాలు, వలస కూలీలకు సాయంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌ కూలీలను మేం ప్రత్యేక రైళ్లలో తరలించాం. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను తరలించడంలోనూ కేంద్రం చొరవ చూపడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో సీఎంలను కలిసినప్పుడు కేంద్రంపై సమరభేరి మోగించాలనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. దీనిపై భాజపాకు తగిన శాస్తి చేయాలి. దీనికి ఝార్ఖండ్‌ కలిసి రావాలి’’ అని కేసీఆర్‌ అన్నారని తెలిసింది.

అప్పుడే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు?.. సోరెన్‌
సోరేన్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు దారుణం. తమ హయాంలో మూడు రాష్ట్రాలు ఇచ్చామని చెబుతున్న మోదీ. 2000లోనే ఎందుకు తెలంగాణ ఇవ్వలేదో కూడా చెప్పాలి. రాష్ట్రంలో భాజపా అధికారం కోల్పోగానే.. ఝార్ఖండ్‌పై కక్ష సాధిస్తోంది. మా రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు ఇవ్వడం లేదు. మోదీ దీనికి ఏం సమాధానం చెబుతారు? ఆయనకు ప్రాంతీయ పార్టీల సత్తా ఏమిటో చూపుదాం’’ అని సోరెన్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అమర జవాన్ల కుటుంబాలకు సాయం
సరిహద్దులో చైనాతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ సాయం అందించారు. ఝార్ఖండ్‌కు చెందిన కుందన్‌ కుమార్‌ ఓజా భార్య నమ్రతకు 10 లక్షల చెక్‌ను హేమంత్‌ సోరెన్‌తో కలిసి అందజేశారు. మరో వీర సైనికుడు గణేష్‌ కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్‌ను అందించారు.  

శిబుసొరెన్‌ ఆశీర్వాదం
తెలంగాణ ఉద్యమాన్ని 2001లో ప్రారంభించామని, ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు, హేమంత్‌ సోరెన్‌ తండ్రి శిబు సోరెన్‌ హాజరయ్యారయ్యారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. సోరెన్‌ తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచారని, వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణ మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారన్నారు.


ఝార్ఖండ్‌లో ఘనస్వాగతం

దిల్లీ నుంచి శుక్రవారం ఉదయం ఝార్ఖండ్‌ రాజధాని రాంచీకి చేరుకున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తొలుత గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహం వద్ద కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్‌ సీఎం నివాసానికి వెళ్లారు. కేసీఆర్‌ ఆయన సతీమణి శోభ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని హేమంత్‌ సోరెన్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేమంత్‌, ఆయన తండ్రి ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శిబు సొరెన్‌ కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేశారు. కేసీఆర్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఝార్ఖండ్‌ పర్యటన ముగించుకుని రాంచీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని