CM KCR: అమీతుమీ.. చలో దిల్లీ

యాసంగి ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంజాబ్‌ తరహాలో ఎఫ్‌సీఐ ద్వారా మొత్తం సేకరించాలనే డిమాండ్‌తో మరోసారి తెరాస సర్కారు పోరుబాట పట్టనుంది.

Updated : 21 Mar 2022 10:13 IST

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎంవో
నేడు పార్లమెంటులో ఎంపీల ఆందోళన
ధాన్యం కొనుగోళ్ల కోసం ఒత్తిడి  
పోరుబాటపై తెరాస శాసనసభాపక్ష నేటి భేటీలో సీఎం దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంజాబ్‌ తరహాలో ఎఫ్‌సీఐ ద్వారా మొత్తం సేకరించాలనే డిమాండ్‌తో మరోసారి తెరాస సర్కారు పోరుబాట పట్టనుంది. రాష్ట్రంలో ఆందోళనలు, పార్లమెంటులో నిరసనలు, దిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులతో భేటీ ద్వారా కేంద్రంపై బహుముఖ ఒత్తిడికి సన్నద్ధమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎంవో అనుమతి కోరింది. కేంద్రం స్పందించని పక్షంలో ఇతర పార్టీల నేతలను కలిసి వారి మద్దతు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తెరాస రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల సమస్యపై అందోళనలకు సంబంధించి పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల్లో ఆ బాధ్యతలు మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అప్పగించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితుల అధ్యక్షులకు కూడా భాగస్వాములను చేయనున్నారు. ఈ వారంలోనే ఒక రోజు తెరాస ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. యాసంగిలో పండిన 50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు అత్యవసరం కాగా... వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా నిల్వ ఉంది. ప్రస్తుతం కోతలు జరుగుతుండగా.. వారం పది రోజుల్లో  ధాన్యం రాశులు పోటెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపై తెరాస కేంద్రంపై ఉద్ధృత పోరుకు నిర్ణయించింది.  తెలంగాణభవన్‌లో సమావేశానంతరం సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి తదితరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇతర అధికారుల బృందంతో ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు. గత నవంబరులోనూ సీఎం కేసీఆర్‌ ఈ సమస్యపై దిల్లీకి వెళ్లినా ప్రధాని, కేంద్రమంత్రులను కలిసే అవకాశం రాలేదు. ఈసారి భేటీ కోసం ముందుగానే అనుమతి (అపాయింట్‌మెంటు) తీసుకోవాలని నిర్ణయించారు. పీఎం, కేంద్రమంత్రుల భేటీ కోసం సీఎం కేసీఆర్‌ మూడు నుంచి నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారని తెలిసింది. సమస్య పరిష్కారమయ్యాకే హైదరాబాద్‌కు రావాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ఎంపీలకు ఇప్పటికే సీఎం సంకేతాలిచ్చారు. సోమవారం పార్లమెంటులో ధాన్యం కొనుగోళ్ల సమస్యను ప్రస్తావించాలని, మాట్లాడే అవకాశం ఇవ్వని పక్షంలో ఆందోళనలకు పూనుకోవాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని