లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్‌ చికిత్స

కొవిడ్‌ చికిత్సలో కీలక నిర్ణయమిది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ నివేదిక ఉంటే కాని చేర్చుకునేది లేదంటున్న ఆసుపత్రులకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. చికిత్స ప్రారంభంలో జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది.

Updated : 29 Apr 2021 09:22 IST

ఫలితం వచ్చే వరకూ ఆగక్కర్లేదు
కాలహరణంపై కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్సలో కీలక నిర్ణయమిది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ నివేదిక ఉంటే కాని చేర్చుకునేది లేదంటున్న ఆసుపత్రులకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. చికిత్స ప్రారంభంలో జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం వేచిచూడకుండా సత్వరమే చికిత్సను ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లక్షణాలు వచ్చిన దగ్గర నుంచి కొవిడ్‌ నిర్ధారణ ఫలితం వచ్చే వరకూ కనీసం మూడు నాలుగు రోజుల సమయం పడుతుండడంతో.. ఈ జాప్యాన్ని నివారించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా కూడా లక్షణాలు కనిపిస్తున్నవారికి ఇవ్వాల్సిన చికిత్సలపై బుధవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులైన వైద్యనిపుణులతో దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించారు. ఇందులో ఐసీఎంఆర్‌ సంచాలకులు డాక్టర్‌ బలరాం భార్గవ, దిల్లీ ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులతో పాటు తెలంగాణ నుంచి రాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు, నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ టి.గంగాధర్‌ పాల్గొన్నారు. కొవిడ్‌ చికిత్సల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన బాధితులకు వైద్యసేవలు ప్రారంభించడంపై ఇందులో ప్రధానంగా చర్చించారు.

ప్రస్తుతం కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నా.. అది కరోనా వైరస్‌ కాకపోయి ఉండొచ్చనే భావనతో ఎక్కువమంది కొద్దిరోజులు ఎటువంటి చికిత్స తీసుకోవడంలేదు. మరికొందరు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చే వరకూ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేసరికి రెండు మూడు రోజులు పడుతుండడంతో చికిత్సలో మరింత జాప్యం జరుగుతోంది. ఇటువంటి సందర్భాల్లో కొవిడ్‌ బాధితుల ఆరోగ్యం ఉన్నట్టుండి దిగజారుతోంది. ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా దెబ్బతిని తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. అప్పుడు చికిత్స కష్టతరమవుతోంది. కొన్నిసార్లు పరిస్థితి దిగజారుతోంది కూడా. దీన్ని నివారించడానికి బుధవారం సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను సవరిస్తూ.. నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇక నుంచి వైద్యనిపుణులు ఈ సూచనలను పాటించాలని ఆదేశాలు జారీచేశారు.

కొత్త విధానమిది..

* కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుంటే.. నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే చికిత్సను ప్రారంభించాలి.
* ఇంటి వద్ద చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పరీక్షిస్తుండాలి. ఏ మాత్రం పరిస్థితి విషమిస్తున్నట్లుగా గుర్తించినా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
* ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా.. బాధితుల్లో లక్షణాలు కనిపిస్తుంటే.. దాన్ని కొవిడ్‌గానే భావించి చికిత్స అందించాలి.
* ఇంటి వద్దే చికిత్స పొందుతున్న బాధితుల్లో.. ఔషధాలు అందిస్తున్నా కూడా జ్వరం తగ్గకుండా అలాగే వస్తుంటే.. శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నట్లుగా గుర్తిస్తే.. వారికి కూడా సత్వరమే స్టెరాయిడ్‌ ఔషధ చికిత్సను ప్రారంభించాలి.
* ఈ మేరకు దేశవ్యాప్తంగా చికిత్సలో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని