Chinna Jeeyar Swamy: మా మాటలను వక్రీకరించారు

‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా మాట్లాడే

Updated : 19 Mar 2022 04:41 IST

సమ్మక్క-సారలమ్మలపై 20 ఏళ్ల క్రితం అన్న విషయమది
మధ్యలోంచి ఓ మాటను తెచ్చి ప్రచారం చేస్తున్నారు
ఎవరితోనూ విభేదాలు లేవు.. వారు పెట్టుకుంటే ఏమీ చేయలేం
విలేకరులతో చినజీయర్‌ స్వామి

ఈనాడు, అమరావతి: ‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎప్పుడైనా ఒక మాట విన్నప్పుడు.. దానికి పూర్వాపరాలు చూడాలి. ఎక్కడో మధ్యలో ఒక మాటను తీసుకుని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీలనే కాదు, ఎప్పుడూ ఎవరినీ కించపర్చలేదు. 20 ఏళ్ల క్రితం సమ్మక్క సారలమ్మ దేవతలపై అన్న మాట గురించి ఇలా వచ్చిందని మావాళ్లు చెప్పారు. ‘ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలా. మనుషుల్లో నుంచే వచ్చారు. వారికి ఉండే గుణాల వల్ల దేవతలయ్యారు. అలాంటివారిని మధ్యలో పెట్టుకుని మనం అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించొద్దు’ అని మాత్రమే అన్నాం. అది తప్పా? విషయం తెలుసుకోకుండా అందులోని ఒక మాటను పట్టుకుని ఇప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని చినజీయర్‌ స్వామి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గుంటూరు జిల్లా సీతానగరంలో విజయకీలాద్రిపై విలేకర్లతో మాట్లాడారు.

‘‘ఇటీవల సమతామూర్తి కార్యక్రమం జరిగింది. దీని గురించి యావత్తు ప్రపంచం మాట్లాడుకుంటోంది. అది సహించలేనివారే గ్రామ దేవతలను తూలనాడినట్లు, తద్వారా ఆదివాసీలను అవమానించినట్లు చెబుతున్నారు. గిరిజనుల కోసం పాఠశాలలు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేశాం.  జనాన్ని ప్రభావితం చేసే దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎన్నడూ ప్రోత్సహించం. ఆ పేరుతో జరిగే అరాచకాలను అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది. దీనిని అర్థం చేసుకోలేని వ్యక్తుల వివేచనకే వదిలేస్తున్నా. పనిగట్టుకుని దీన్నో పెద్దఅంశంగా చిత్రీకరించడం తగదు. సమాజహితంపై కాంక్ష ఉండేవారైతే వచ్చి మాట్లాడాలి.

జ్ఞానంలో ఉన్నతులైతే.. హరిజనులు, గిరిజనులు, అన్ని వర్గాల వారికీ గౌరవం ఇవ్వాలని రామానుజులు ఎప్పుడో చెప్పారు. 1938లోనే పెదజీయర్‌ స్వామి.. దేశంలోనే మొదటిసారిగా ఆదివాసీలకు పక్కా ఇళ్లతో కాలనీని మండపేట సమీపంలోని అర్తమూరులో నిర్మించారు. ఇదే స్ఫూర్తితో 2004లో ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలకు విద్య అందించేందుకు పాఠశాలను ప్రారంభించాం. మహిళల సమానతకు ప్రాధాన్యమిచ్చే సంప్రదాయం మాది’’ అని చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

యాదాద్రి ప్రారంభోత్సవ ఆహ్వానంపై..

యాదాద్రి ప్రారంభోత్సవ ఆహ్వానంపై.. ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘మేం ఎందులోనూ పూసుకు తిరిగేవాళ్లం కాదు. అడిగితే సలహా చెప్పడం, చేసి పెట్టడం మా బాధ్యత. అలా బాధ్యత తీసుకుంటే నూటికి నూరుశాతం న్యాయం చేస్తాం. బాధ్యత కావాలని వెంటపడి పాకులాడే అలవాటు లేదు’’ అని బదులిచ్చారు.

సమ్మక్క సారలమ్మకు సంబంధించి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని వీడియోలో మాట్లాడారు కదా.. మీరు సమతామూర్తి దర్శనానికి టికెట్‌ పెట్టారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘దర్శనానికి టికెట్‌ పెట్టలేదు. అదో పెద్ద ప్రాంగణం. రుసుము లేకపోతే అంతమందిని నియంత్రించడం కష్టమని.. సామాన్యులకూ అందుబాటులో ఉండాలనే రూ.150 ప్రవేశ రుసుముగా నిర్ణయించాం. అదీ నిర్వహణ కోసమే. ప్రసాదాలు, పూజలు... ఇలా లోపలన్నీ ఉచితమే’ అని అన్నారు.

ఎక్కువగా రాజకీయ నేతలతో మసలుతున్నారు. మున్ముందు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘మేం రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. మేం భిక్షా సన్యాసులం. రాజకీయాల్లోకి వెళ్లాలని మనసులో ఎప్పుడూ లేదు. రాదు కూడా’ అని సమాధానమిచ్చారు.


తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు...

‘‘మాకు ఎవరితోనూ విభేదాలు ఉండవు. వాళ్లు ఏమైనా పెట్టుకుంటే ఏమీ చేయలేం. మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగేవాళ్లం. అలా ఉంటాం కనకే ఇలాంటి విషయాలు మాట్లాడగలుగుతున్నాం. లేనిపక్షంలో వాళ్లకి, వీళ్లకి భయపడుతూ ఎక్కడో మూలకు నక్కి మాట్లాడతారు. సక్రమమైన మార్గంలో నడవడం లేదని భావిస్తే చెప్పడం మాలాంటి వాళ్ల బాధ్యత. సమాజానికి మేం కళ్ల లాంటి వారం. నువ్వు నడుస్తున్నప్పుడు కాలులో ఏం గుచ్చుకుంటుందో చెప్పడం మా బాధ్యత. దాన్ని గుర్తించకుండా వెళ్లి తొక్కుతాను అంటే.. రక్తం కారేది కాళ్లకే. కానీ.. కన్నీరు కార్చేది కళ్లే’’ అని చిన జీయర్‌స్వామి బదులిచ్చారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు