Coal crisis: బకాయిల కొండతోనే బొగ్గు కొరత!

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరతకు పాత బకాయిలు కొండలా పేరుకుపోవడమూ ప్రధాన కారణాల్లో ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్‌ కేంద్రాల యాజమాన్యాలు రూ.వందల కోట్ల సొమ్ము బాకీ పడ్డాయి. ఒక్క సింగరేణి గనులకే 5 రాష్ట్రాల యాజమాన్యాలు

Updated : 23 Feb 2024 16:06 IST

గనులకు సొమ్ము చెల్లించని విద్యుత్‌ కేంద్రాలు
  రూ.వందల కోట్ల బాకీలు.. ఆపై వడ్డీలు
  సొమ్ము వసూలు కాక సరఫరా నిలిపివేత
-  సింగరేణికి 5 రాష్ట్రాల బకాయిలు రూ.5 వేల కోట్లపైనే  
  సంక్షోభానికి ఇది కూడా ప్రధాన కారణమంటున్న కేంద్రం
ఈనాడు - హైదరాబాద్‌

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరతకు పాత బకాయిలు కొండలా పేరుకుపోవడమూ ప్రధాన కారణాల్లో ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్‌ కేంద్రాల యాజమాన్యాలు రూ.వందల కోట్ల సొమ్ము బాకీ పడ్డాయి. ఒక్క సింగరేణి గనులకే 5 రాష్ట్రాల యాజమాన్యాలు రూ.5 వేల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలో కోల్‌ ఇండియా సహా పలు బొగ్గు గనులకు రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లకు చేరినట్లు అంచనా. బకాయిలు పెరగడం వల్ల ఏయే విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరాను గనులు తగ్గించాయనే సమాచారాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా వెల్లడించింది. నెలల తరబడి క్రమంగా సరఫరా తగ్గిస్తూ రావడం వల్ల పలు విద్యుత్‌ కేంద్రాల్లో నిల్వలు అడుగంటినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. కొన్ని ప్రధాన కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్ము చెల్లించనందునే సరఫరా తగ్గినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని 3 కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్మును సకాలంలో చెల్లించనందునే సరఫరా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ థర్మల్‌ కేంద్రాలు కూడా సింగరేణి సంస్థకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా బొగ్గు సరఫరా కొనసాగుతోంది.
 

వడ్డీలపై వివాదాలు
బొగ్గు కొనే సమయంలో ఎన్ని రోజుల్లోగా డబ్బు చెల్లిస్తామో తెలుపుతూ గనులతో థర్మల్‌ కేంద్రం యాజమాన్యం ఒప్పందం చేసుకుంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాలు ఈ గడువును పాటించకపోవడంతో గనులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. గడువులోగా సొమ్ము చెల్లించకపోతే బకాయిలపై గనుల యాజమాన్యం వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీలే రూ.వందల కోట్లకు చేరాయి. వడ్డీలు కట్టలేమని, వాటిని మాఫీ చేస్తే అసలు సొమ్ము చెల్లిస్తామని కొన్ని యాజమాన్యాలు బేరమాడుతున్నాయి. ఈ వివాదాలు తేలక బకాయిలు వడ్డీలు సహా కొండల్లా పేరుకుపోతున్నందున బొగ్గు సరఫరా తగ్గిస్తున్నట్లు బొగ్గు గనుల సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఇప్పటికిప్పుడు బకాయిలు చెల్లించేంత ఆర్థిక స్తోమత థర్మల్‌ కేంద్రాలకు గాని, బొగ్గు ఉత్పత్తిని పెంచే సామర్థ్యం గనుల యాజమాన్యాలకు గానీ లేనందున సరఫరా ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని ఆయన వివరించారు. ఏ థర్మల్‌ కేంద్రానికి ఏ రోజు ఎంత సరఫరా చేశారు, ఎంత సొమ్ము రావాలనే వివరాలను గనుల యాజమాన్యాలు, ఏ గని నుంచి ఎంత బొగ్గును కొన్నారు, ఎంత చెల్లించాలనే వివరాలను విద్యుత్‌ కేంద్రాల వెబ్‌సైట్లలో పొందుపరిస్తే అసలు సమస్య ఏమిటో అందరికీ తెలిసిపోతుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని