Corona Third Wave: ఇక ఆంక్షల్లేని జీవితం గడపొచ్చు

రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు.

Updated : 09 Feb 2022 05:36 IST

మూడో ముప్పు ముగిసినట్లే!

విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు

కరోనా కనుమరుగు కాలేదనేది మరవొద్దు 

మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సిందే

ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించుకోవచ్చని సూచించారు. అయితే కరోనా వైరస్‌ పూర్తిగా కనుమరుగు కాలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అప్రమత్తం చేశారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను పాటిస్తూనే అన్ని కార్యకలాపాలూ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. భక్తులు మేడారం జాతరకు వెళ్లొచ్చని తెలిపారు. హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్య సంచాలకులు విలేకరులతో మాట్లాడారు.

సాధారణ ఫ్లూగా రూపాంతరం!

‘‘వచ్చే వారం, పదిరోజుల్లో రోజుకు వంద కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి వస్తుంది. మూడోదశలో ఒమిక్రాన్‌ బీఏ-2 ఉపరకం వేరియంటే 70 శాతం నమోదైంది. 4 వారాల కిందట 5 శాతం నమోదైన పాజిటివిటీ రేటు ఇప్పుడు 2 శాతానికి తగ్గిపోయింది. 7 రోజుల్లోనే కోటి ఇళ్లలో జ్వర సర్వేలు చేపట్టి, లక్షల మందికి ఔషధ కిట్లను అందించాం. ఒమిక్రాన్‌ తీవ్రమైనదే అయినా.. టీకాలను సకాలంలో అధికులకు పంపిణీ చేసి.. సమర్థంగా ఎదుర్కోగలిగాం. అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో 40-50 శాతం కూడా వ్యాక్సినేషన్‌ జరగకపోవడంతో అక్కడ ఒమిక్రాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఎన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా.. ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేశాం. వచ్చే కొన్ని నెలలపాటు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు తక్కువ. రాబోయే రోజుల్లో కరోనా సాధారణ ఫ్లూగా రూపాంతరం చెందే అవకాశాలే అధికం.  కొత్త వైరస్‌లు వస్తూ.. కాలానుగుణ ఫ్లూ మాదిరిగా వస్తూపోతూ ఉంటుంది. కొవిడ్‌ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. భవిష్యత్‌లో అన్ని వేరియంట్లను తట్టుకునే టీకాలు అందుబాటులోకి వస్తాయి. కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలు రెండో దశతో పోల్చితే మూడోదశలో తక్కువే. ఈ ఏడాది జనవరి 31 వరకూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తర్వాత పొడిగిస్తూ ఉత్తర్వులివ్వలేదంటే.. ఎత్తివేసినట్లే. విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రత్యక్ష తరగతులతోనే విద్యార్థులకు ఉపయోగం. మేడారం జాతరకు వచ్చే లక్షల మంది భక్తుల కోసం తాత్కాలికంగా 150 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ తెలిపారు.

కొత్తగా 1,061 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,061 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,79,971కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,102 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా 69,892 నమూనాలను పరీక్షించారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 274 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,36,317 కొవిడ్‌ టీకాలను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని