Firing on Asaduddin Owaisi: అసదుద్దీన్‌ వాహనంపై కాల్పులు

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా... హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది.

Updated : 04 Feb 2022 07:04 IST

తుపాకులతో దుండగుల బీభత్సం

యూపీలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా ఘటన

గాజియాబాద్‌, అబిడ్స్‌, గోల్కొండ, న్యూస్‌టుడే: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా... హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల తాను బయటపడ్డానని అసదుద్దీన్‌ చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. వారం రోజుల్లోనే యూపీ తొలిదశ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరిగింది.
‘‘మేరఠ్‌లోని కిథౌర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ బయల్దేరాను. మా కాన్వాయ్‌లో నాలుగు కార్లు ఉన్నాయి. హాపుర్‌-గాజియాబాద్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా... ఛాజర్సీ టోల్‌గేట్‌ వద్ద నా వాహనంపై ముగ్గురు-నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారు ఆయుధాలను అక్కడే వదిలి పారిపోయారు. తూటాలు దూసుకెళ్లడంతో నా వాహనం టైర్లు పంక్చర్‌ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. అయితే మాకెవరికీ గాయాలు కాలేదు. అల్లా దయవల్ల మేమంతా క్షేమం’’ అని అసదుద్దీన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీ చేరుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కారుపై కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు సమాచారం అందించారన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టి, దీని వెనుక ఎవరు ఉన్నారన్నది తెలుసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర దర్యాప్తు బాధ్యత మోదీ, యోగి ప్రభుత్వాలదేనన్నారు. ఈ అంశంపై తాను లోక్‌సభ స్పీకర్‌ను శుక్రవారం కలవనున్నట్టు చెప్పారు.

మాజిద్‌ హుస్సేన్‌ చొరవ...
అసదుద్దీన్‌ కాన్వాయ్‌లో వెనుక కారులో ఉన్న హైదరాబాద్‌ మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ కాల్పుల సమయంలో వేగంగా స్పందించారు. ఆయన సూచనతో కారు డ్రైవరు కాల్పులు జరుపుతున్న ఓ దుండగుడిపైకి వాహనాన్ని వేగంగా ఉరికించారు. దీంతో అతడి కాలికి గాయమై, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు చెబుతున్నారు.

ఒకరిని అరెస్టు చేశాం: అదనపు డీజీపీ
ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు యూపీ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌, హాపుర్‌ జిల్లా ఎస్పీ దీపక్‌ భుకేర్‌లు వెల్లడించారు. అతడి నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. పరారైన మిగతా నిందితులు ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.

నాపై పెద్ద కుట్ర జరిగింది: ఒవైసీ
ఘటన నేపథ్యంలో అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం రాత్రి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘నాపై పెద్ద కుట్ర జరిగింది. అయినప్పటికీ, అల్లా దయతో క్షేమంగా బయటపడ్డా. ప్రజలు, మజ్లిస్‌ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ ప్రజలు... తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలి. నాపై జరిగిన దాడికి కారకులెవరన్నది తేల్చాల్సిన బాధ్యత యూపీ, కేంద్ర ప్రభుత్వాలపైనే ఉంది. కాల్పుల తీరును చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగినట్టు అర్థమవుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఒవైసీపై దాడి జరిగిందన్న వార్త తెలియగానే హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం వద్దకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
* అసదుద్దీన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఆయనపై కాల్పులు జరపడం పిరికి చర్యగా పేర్కొన్నారు. అసద్‌ సురక్షితంగా బయటపడడంపై సంతోషం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని