Updated : 01 Nov 2021 09:45 IST

G-20 Summit 2021: శతాబ్ది మధ్య నాటికి కర్బన కళ్లెం

వాతావరణ మార్పులపై జి-20 తీర్మానం
తాప విద్యుత్కేంద్రాలకు సాయం నిలుపుదల
సురక్షిత టీకాలకు పరస్పరం గుర్తింపు
క్రమబద్ధంగా అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి
డిక్లరేషన్‌తో ముగిసిన శిఖరాగ్ర సదస్సు

రోమ్‌లోని సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెన్‌లోకి ఆదివారం నాణేలు విసురుతున్న ప్రధానమంత్రి  నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

రోమ్‌: వాతావరణ మార్పులకు కళ్లెం వేయడంపై జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి ముకుతాడు వేసి కర్బన తటస్థత(కార్బన్‌ న్యూట్రాలిటీ/ నెట్‌ జీరో)ను ఈ శతాబ్ది మధ్యనాటికి సాధించాలని ప్రతినబూనాయి. రెండ్రోజుల పాటు రోమ్‌లో జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. ఐరాస ఆధ్వర్యంలో గ్లాస్గోలో మొదలైన వాతావరణ మార్పుల సదస్సుకు చర్చనీయాంశాన్ని దీనిలో ఖరారు చేసినట్లయింది. బొగ్గును మండించడం వల్ల ఎదురవుతున్న సమస్యల్ని నివారించాలంటే.. విదేశాల్లోని తాప విద్యుత్కేంద్రాలకు ప్రభుత్వాల తరఫున నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నుంచే ఇది అమల్లోకి రానుంది. బొగ్గు వినియోగాన్ని దేశీయంగా క్రమంగా తగ్గించుకునేందుకు మాత్రం ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. ఈ మేరకు భారత్‌, చైనా వంటి దేశాలకు కొంత ఊరటనిచ్చే ఉమ్మడి ప్రకటన విడుదలైంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో నాలుగింట మూడొంతులు ఒక్క జి-20 దేశాల నుంచే వెలువడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంలో పేద దేశాలకు సాయపడేందుకు ధనిక దేశాలు ఏటా 100 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,50,000 కోట్లు) సమీకరించాలన్న మునుపటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కూటమి దేశాలు పునరుద్ఘాటించాయి.

సరఫరాల్లో ఇబ్బందుల్ని పరిష్కరించాలి: బైడెన్‌
కొవిడ్‌-19 మహమ్మారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ కలిపి 15 లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నా, సరఫరాల పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తెరిపిన పడాలంటే ఇలాంటి అవరోధాలు ఉండకూడదని అన్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌తో బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ భేటీ అయ్యారు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరి వల్ల ఉద్రిక్తత పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు.

ట్రెవీ ఫౌంటెన్‌లో నాణెం విసిరిన మోదీ
మోదీ పలు ప్రపంచ దేశాధినేతలతో కలిసి రోమ్‌లోని సుప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెన్‌కు వెళ్లారు. అక్కడి నీటిలో ఓ నాణెం కూడా విసిరారు. భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్‌ వెళ్తారని ప్రజల నమ్మకం. మోదీ కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో చర్చలు జరుపుతున్న ప్రధాని మోదీ

మెర్కెల్‌, సాంచెజ్‌లతో ద్వైపాక్షిక చర్చలు
సదస్సుకు హాజరైన జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో మోదీ విడివిడిగా చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై అర్థవంతమైన సమాలోచనలు సాగినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. హరిత హైడ్రోజన్‌, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా స్పెయిన్‌ను మోదీ కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పురోగతిపై ఇరువురు నేతలు సంతృప్తి వెలిబుచ్చారు. ఎయిర్‌బస్‌ స్పెయిన్‌ నుంచి సి-295 విమానాల కొనుగోలుకు భారత్‌తో ఇటీవల కుదిరిన ఒప్పందం సహా వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

టీకాల కార్యక్రమం ప్రపంచానికి మంచిది
కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతులు వేగంగా లభించేలా చూడడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను బలోపేతం చేయాలని జి-20 దేశాలు నిర్ణయించినట్లు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. కరోనా టీకాల కార్యక్రమం ప్రపంచానికి మంచిదని ‘రోమ్‌ డిక్లరేషన్‌’ పేర్కొన్నట్లు చెప్పారు. సురక్షిత, సమర్థవంతమైన టీకాలను పరస్పరం గుర్తించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

*  టీకాల సరఫరాను గణనీయంగా పెంచి.. ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి ఈ ఏడాది చివరినాటికి, 70% మందికి వచ్చే ఏడాది మధ్య నాటికి కరోనా టీకాలు అందేలా చూడాలని సమావేశం తీర్మానించింది. కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో ముందు వరసలో ఉన్న సిబ్బంది, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతున్నట్లు తీర్మానంలో చేర్చింది.

తదుపరి సదస్సు ఇండొనేసియాలో
జి-20 సదస్సు 2022లో ఇండొనేసియాలో, 2023లో భారత్‌లో, 2024లో బ్రెజిల్‌లో జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సురక్షితంగా, క్రమబద్ధంగా అంతర్జాతీయ ప్రయాణాలను పునఃప్రారంభించాలని దేశాలు నిర్ణయించాయి. జీవ వైవిధ్య ముప్పును 2030 నాటికి తిరోగమనం పట్టించే చర్యల్ని బలోపేతం చేయాలని తీర్మానించాయి. అందరికీ పోషకాహారం అందించేలా చూస్తామని ప్రతినబూనాయి.


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని