Gas Rate: బండ బాదుడు!

వినియోగదారులకు ఊపిరాడనివ్వకుండా చేస్తూ మరోసారి ఎల్‌పీజీ వంటగ్యాస్‌ ధరతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలనూ బుధవారం పెంచేశారు. సిలిండర్‌పై మరో రూ. 15 భారం మోపారు. లీటరు పెట్రోలుపై మరో 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. 14.2 కేజీల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత జులై నుంచి ఇంతవరకు 4 దఫాలుగా మొత్తం రూ. 90 పెంచడం గమనార్హం. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 899.50కి చేరగా కోల్‌కతాలో రూ. 926కి పెరిగింది. హైదరాబాద్‌లో రూ.952కు చేరుకుంది.  కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో ‘రాయితీ’ గాల్లో కలిసిపోయింది.

Updated : 07 Oct 2021 09:51 IST

వంటగ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ. 15 పెంపు

పెట్రోలు, డీజిల్‌ ధరలూ పైపైకి..

దిల్లీ, ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారులకు ఊపిరాడనివ్వకుండా చేస్తూ మరోసారి ఎల్‌పీజీ వంటగ్యాస్‌ ధరతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలనూ బుధవారం పెంచేశారు. సిలిండర్‌పై మరో రూ. 15 భారం మోపారు. లీటరు పెట్రోలుపై మరో 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. 14.2 కేజీల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత జులై నుంచి ఇంతవరకు 4 దఫాలుగా మొత్తం రూ. 90 పెంచడం గమనార్హం. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 899.50కి చేరగా కోల్‌కతాలో రూ. 926కి పెరిగింది. హైదరాబాద్‌లో రూ.952కు చేరుకుంది.  కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో ‘రాయితీ’ గాల్లో కలిసిపోయింది.

5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 502కి చేరింది. ఈ ఏడాది జులైలో వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ. 25.50 పెంచారు. అనంతరం ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. తాజాగా మళ్లీ పెంచడంతో వినియోగదారులపై మోయలేని భారంగా మారింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్లపైనా తాజాగా ధర పెంచారు.

గరిష్ఠ స్థాయికి ‘పెట్రో’ ధరలు

అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల గరిష్ఠస్థాయికి చేరాయి. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర దిల్లీలో  రూ. 102.94కి, ముంబయిలో రూ. 108.96కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర ఈ నగరాల్లో వరుసగా రూ. 91.42, రూ. 99.17కి చేరింది. సెప్టెంబరు 24 నుంచి ఇంతవరకు డీజిల్‌పై మొత్తం రూ. 2.80 (లీటరుకు) పెరిగింది. అలాగే సెప్టెంబరు 28 నుంచి ఇంతవరకు పెట్రోల్‌పై మొత్తం రూ. 1.75 పెంచారు.

రూ. వేల కోట్లలో భారం

హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై బుధవారం 29 పైసలు పెరిగి రూ. 107.09కి, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.99.75కి చేరుకుంది. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో డీజిల్‌ ధర లీటరు రూ.వంద దాటింది. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి. గతంలో నెలకు ఒకదఫా మాత్రమే ధరలో పెంపుదల ఉండేది. 2017 జూన్‌ ఆరో తేదీ నుంచి రోజువారీగా ధరల మార్పు విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లకు పైగా ఈ విధానమే అమలులో ఉంది.  ఈ ఏడాది జనవరి ఒకటిన లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా బుధవారం 107.09కు చేరింది. లీటరు డీజిల్‌ ధర రూ 80.60లు ఉండగా క్రమంగా పెరుగుతూ బుధవారం రూ. 99.75లకు చేరింది. ఆ లెక్కన గడిచిన 9 నెలల్లో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై రూ. 20.03 పెరిగింది. డీజిల్‌పై రూ. 19.15 పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలుపై సుమారు 59 శాతం, డీజిల్‌పై సుమారు 52 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయి. రోజూ కొన్ని పైసల చొప్పున ధర పెంచుతుండటంతో భారం అంతగా తెలియనప్పటికీ జనవరి నుంచి చూస్తే రూ. వేల కోట్లలో చేతి చమురు వదిలిందన్నది వాస్తవం.

త్వరలో సబ్సిడీకి మంగళం?

వంట గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని  ఎత్తివేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే... అది కూడా నామమాత్రంగా రూ. 40.71 సబ్సిడీ ఇస్తోంది. ఏడాదికిపైగా ఇదే మొత్తం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఆ మొత్తానికి కూడా మంగళం పాడేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీనిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ యోచన చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఆ ప్రతిపాదన ఎప్పటికి కార్యరూపంలోకి వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

 


9 నెలల్లో రూ. 205 పెంపు

గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్లపై తొమ్మిది నెలల్లో రూ. 205.50 పెంచారు. తాజాగా సిలిండరుపై రూ. 15 పెంచటంతో హైదరాబాద్‌లో ధర రూ.952లకు చేరుకుంది. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరుపై రూ.33 పెంచటంతో ఆ ధర రూ.1,905కు పెరిగింది. రాష్ట్రంలో సుమారుగా 1.15 కోట్ల గృహావసరాల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున 65 నుంచి 70 శాతం వినియోగదారులు ప్రతి నెలా సిలిండరును కొనుగోలు చేస్తారు.


ధరలు తగ్గించండి ఉయ్యాలో..

బతుకమ్మల మధ్య ఈ గ్యాస్‌ బండేమిటనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం బుధవారం వంటగ్యాస్‌ ధర పెంచడంతో నిరసన తెలపడానికి హుజూరాబాద్‌ మహిళలు ఈ మార్గం ఎంచుకున్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా పాటపాడుతూ అక్కడి శివాలయంలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని విన్నవించారు.

-న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ గ్రామీణం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు