Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్థులకు తియ్యటి వార్త!

మధుమేహం (చక్కెర వ్యాధి) తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌ తీసుకోవడం సర్వసాధారణం. ఇన్సులిన్‌ పాడవకుండా రిఫ్రిజరేటర్‌లో భద్రపర్చాలి. లేదంటే కొన్ని గంటల తర్వాత గడ్డకట్టి పనికిరాకుండా పోతుంది.

Updated : 07 Oct 2021 05:42 IST

‘ఇన్సులాక్‌’ మాలిక్యూల్‌తో గడ్డకట్టని ఇన్సులిన్‌

రిఫ్రిజిరేటర్‌ లేకుండానే నిల్వకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: మధుమేహం (చక్కెర వ్యాధి) తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌ తీసుకోవడం సర్వసాధారణం. ఇన్సులిన్‌ పాడవకుండా రిఫ్రిజరేటర్‌లో భద్రపర్చాలి. లేదంటే కొన్ని గంటల తర్వాత గడ్డకట్టి పనికిరాకుండా పోతుంది. ఈ సమస్య పరిష్కారానికి కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ) పరిశోధకులు ఓ సరికొత్త మాలిక్యూల్‌ని గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ ఇన్సులిన్‌ని గడ్డకట్టకుండా ఉంచే ఈ మాలిక్యుల్‌కు ‘ఇన్సులాక్‌’ అని పేరు పెట్టారు. దీనిని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)లో న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసోనెట్స్‌(ఎన్‌ఎంఆర్‌) ల్యాబ్‌లో పరీక్షించారు. ఇన్సులిన్‌లో ఇన్సులాక్‌ కలిపిన తర్వాత దాని నిర్మాణాన్ని త్రీడీలో పరీక్షించి సాధారణ ఉష్ణోగ్రతలోనూ గడ్డకట్టఁడంలేదని గుర్తించారు. అనంతరం కోల్‌కతాలోని ఐఐసీబీలో ఎలుకలపై ప్రయోగించారు. ఆ పరీక్షలు విజయవంతం కావడంతో.. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రఖ్యాత జర్నల్‌ ‘ఐసైన్స్‌’లో ఇటీవల ప్రచురితమైంది.

ధరలు తగ్గే అవకాశం

‘ఔషధ కంపెనీలు ముందుకొస్తే అన్ని అనుమతులు తీసుకుని క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయ్యి అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుంది. ఆ కొత్త ఇన్సులిన్‌ను ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు. వ్యయం తగ్గుతుంది’ అని ఐఐసీటీ నుంచి పరిశోధనలో పాలుపంచుకున్న ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.జగదీశ్‌, మరో శాస్త్రవేత్త డాక్టర్‌ జితేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని