Etela Rajender: ఏడోసారి ఎమ్మెల్యేగా ఈటల

డబుల్‌ హ్యాట్రిక్‌ల విజేత ఈటల రాజేందర్‌ ఈ ఉప ఎన్నికతో ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఘనత సాధించారు. ముచ్చటగా మూడోసారి ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవడం మరో ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమ సమయంలో

Updated : 03 Nov 2021 05:41 IST

పుట్టిన తేదీ: 20-03-1964
తల్లిదండ్రులు: ఈటల మల్లయ్య, వెంకటమ్మ
విద్యార్హతలు: బీఎస్సీ
స్వస్థలం: కమలాపూర్‌, హనుమకొండ జిల్లా
కుటుంబం: భార్య జమున, కుమారుడు నితిన్‌, కోడలు క్షమిత, కుమార్తె నీత, అల్లుడు అనూప్‌

ఈనాడు డిజిటల్‌- కరీంనగర్‌, సిరిసిల్ల: డబుల్‌ హ్యాట్రిక్‌ల విజేత ఈటల రాజేందర్‌ ఈ ఉప ఎన్నికతో ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఘనత సాధించారు. ముచ్చటగా మూడోసారి ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవడం మరో ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008, 2010 సంవత్సరాల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచారు. ఈసారి ఆత్మగౌరవం పేరిట ఈటల గెలుపు బావుటా ఎగురవేశారు.

ఉద్యమ సమయంలో తెరాసకు
తెలంగాణ ఉద్యమ సమయంలో 2002లో ఈటల తెరాసలో చేరారు. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో తొలిసారిగా కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో ఇక్కడి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌ కనుమరుగవ్వడంతో హుజూరాబాద్‌ నుంచి 2009 నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. తెరాస శాసనసభాపక్షనేతగా వ్యవహరించారు. 2010 ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2014, 2018లోనూ గెలిచి తెరాస అధికారంలోకి వచ్చిన రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2010 ఉప ఎన్నికలో 79,227 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

11 గంటలపాటు సాగిన లెక్కింపు
ఈనాడు, హైదరాబాద్‌: ఓట్ల లెక్కింపునకు సుమారు 11 గంటల సమయం పట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం మధ్యాహ్ననికే వెలువడింది. హుజూరాబాద్‌ ఫలితం వెల్లడికి మాత్రం సాయంత్రమైంది. బద్వేలుతో పోలిస్తే ఇక్కడ పోలింగ్‌ శాతం ఎక్కువ కావటం కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. అలాగే 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో రెండు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించారు. దీనివల్ల అధిక సమయం పట్టిందని చెబుతున్నారు. 2,05,053 ఓట్లు పోలు కావటంతో 22 రౌండ్లుగా లెక్కించాల్సి వచ్చింది. బద్వేలులో 13 రౌండ్లలోనే లెక్కింపు జరిగింది.

నోటాకు 1,036 ఓట్లు
ఇక్కడ 2014 ఎన్నికల్లో నోటాకు 1,445, 2018లో 2,867 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో 1,036 ఓట్లు వచ్చాయి.

గెల్లుకు సొంతూర్లో దక్కని ఆధిక్యం!
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సొంతూరైన వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో తెరాసకు 358 ఓట్లు పోలవ్వగా, భాజపా అభ్యర్థి రాజేందర్‌కు 549 ఓట్లు వచ్చాయి. 

శాలపల్లిలో భాజపాకే...
దళితబంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన హుజురాబాద్‌ మండలం శాలపల్లిలో 544 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, భాజపా అభ్యర్థి రాజేందర్‌కు 312.., తెరాసకు 175 ఓట్లు వచ్చాయి.

నేడు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. హుజూరాబాద్‌ ఫలితంపై ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పీఏసీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని