Huzurabad By Election: ఉప సమరం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.

Updated : 29 Sep 2021 09:23 IST

అక్టోబరు 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక
ఏపీలోని బద్వేలు సహా దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకూ..
షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, దిల్లీ - హైదరాబాద్‌, అమరావతి: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా సహా వివిధ కారణాలతో ఉప ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబరు 4న పశ్చిమ బెంగాల్‌లోని మూడు, ఒడిశాలోని ఒక శాసనసభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మిగతా రాష్ట్రాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పండుగల తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. పరిస్థితులను సమీక్షించి తాజా షెడ్యూల్‌ విడుదల చేసినట్లు ప్రకటించింది.

ఎన్నికలు జరిగే స్థానాలివే..  

దాద్రానగర్‌ హవేలి, ఖాండ్వా (మధ్యప్రదేశ్‌), మండి (హిమాచల్‌ప్రదేశ్‌) లోక్‌సభ స్థానాలతో పాటు అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, బిహార్‌లో 2, కర్ణాటకలో 2, రాజస్థాన్‌లో 2, హరియాణా, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఒక్కో శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకట సుబ్బయ్య మృతితో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు (ఎస్సీ) స్థానాలు ఖాళీ అయ్యాయి.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి  

ప ఎన్నికల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్లకు ముందు, తర్వాత ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. సమావేశమందిరాల్లో 30 శాతం మందిని, బహిరంగ సభల్లో మైదానం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించాలి. ముఖ్య ప్రచారకర్తల సంఖ్య 20 మందికి మించకూడదు. రోడ్‌ షోలు, కార్లు, మోటారు సైకిళ్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతిలేదు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు అయిదుగురికి మించకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవాలి. ఎన్నికల రోజున అభ్యర్థి రెండు వాహనాలతో ముగ్గురు వ్యక్తులతోనే పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని