UGC Chairman: అత్యున్నత విద్యా పీఠంపై తెలుగు బిడ్డ

దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత పదవి మరోసారి తెలుగు వ్యక్తికి దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన ఛైర్మన్‌గా జేఎన్‌యూ ఉపకులపతి ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్‌

Updated : 05 Feb 2022 05:36 IST

యూజీసీ ఛైర్మన్‌గా జగదీశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత పదవి మరోసారి తెలుగు వ్యక్తికి దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన ఛైర్మన్‌గా జేఎన్‌యూ ఉపకులపతి ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో అయిదు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1961లో ఏపీలోని తెనాలికి చెందిన వాసిరెడ్డి శ్రీకృష్ణ( వీఎస్‌ కృష్ణ), 1991-95 వరకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన జి.రామిరెడ్డి యూజీసీ ఛైర్మన్‌లుగా పనిచేశారు. ఈ పదవిని పొందిన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్‌కుమార్‌. తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ఆయన ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలో.. ఆ తర్వాత మిర్యాలగూడలో చదువుకున్నారు. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశారు. ఉన్నత విద్యను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూలో పూర్తి చేసిన అనంతరం ఖరగ్‌పుర్‌ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఆచార్యుడిగా చేరారు. అక్కడి నుంచి దిల్లీ ఐఐటీకి బదిలీ అయ్యారు. అనంతరం జేఎన్‌యూలో ఆచార్యుడిగా పనిచేస్తూనే 2016లో ఉపకులపతి అయ్యారు. అయిదేళ్ల పదవీకాలం జనవరి 26తో ముగియగా... కొత్త వీసీ వచ్చే వరకు తాత్కాలికంగా కొనసాగుతున్నారు. యూజీసీ ఛైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ జారీ కాగా మొత్తం 55 మంది వరకు పోటీపడ్డారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఎంపిక చేసింది. జేఎన్‌యూ వీసీగా ఉంటూనే 2016 జూన్‌ 24 నుంచి 2019 జూన్‌ 23 వరకు యూజీసీ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో 2017 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 2 వరకు యూజీసీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. జగదీశ్‌కుమార్‌ మూడు పుస్తకాలు రచించారు. మొత్తం దాదాపు 250 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆయన తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు