KCR Press Meet: ఎ‘వరి’ది దగా..?

‘‘భాజపా నేతలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రైతుల బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని అంటూ రైతులు తమ పొలంలోనే కూలీలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రైతుల కోసం పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తామని, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కోటా కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, దిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. వేలాదిమందితో వెళ్తామని, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. పంజాబ్‌లో నూరుశాతం ధాన్యం సేకరణ చేసి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు.

Updated : 09 Aug 2022 11:57 IST

ధాన్యంపై కేంద్ర వైఖరి ఒకటి... రాష్ట్ర భాజపా నేతలు చెప్పేది మరొకటి

కేంద్రమే వద్దంటే దాన్ని పండించాలంటున్నారు

అవసరమైతే దిల్లీలో ధర్నా.. నేను కూడా వెళ్తా

రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించే వరకు ఊరుకోం

చమురు ధరలపై కేంద్రమే సెస్సులు రద్దు చేయాలి

వ్యాట్‌ మేం పైసా పెంచలేదు.. ఎలా తగ్గించమంటారు?

బండి సంజయ్‌ పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తాం 

కేసీఆర్‌ను టచ్‌ చేసి... బతికి బట్టకడతారా?

కేంద్రం, భాజపా నేతలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

ధాన్యం కొనుగోలు చేయవద్దని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను చూపుతున్న సీఎం కేసీఆర్‌

కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించేవరకు పోరాడతాం. పెట్రోలు, డీజిల్‌ సెస్‌లు విరమించుకోవాలి. మిమ్మల్ని పండుకోనివ్వం, నిలబడనివ్వం. వానాకాలం పంట తీసుకునేవరకు నిద్రపోనివ్వం. ఎవరి మెడలు వంచాలో ప్రజల ముందు పెడదాం. తెలంగాణ హక్కులు, దేశప్రయోజనాల కోసం కేంద్రంతో నిరంతరం పోరాడతాం.

బండి సంజయ్‌ చాలా రోజులుగా అతిగా మాట్లాడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా నిందిస్తున్నారు. నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఇన్నిరోజులు ఓపిక పట్టాను. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను జైలుకి పంపి నువ్వు బతికి బట్టకడతావా?.. కేసీఆర్‌ను టచ్‌ చేసి చూడు తెలుస్తుంది. అంత అహంకారమా? సంజయ్‌ కళ్లు నెత్తికెక్కి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? ఇకపై మీ ఆటలు సాగవు.

‘‘భాజపా నేతలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రైతుల బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని అంటూ రైతులు తమ పొలంలోనే కూలీలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రైతుల కోసం పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తామని, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కోటా కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, దిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. వేలాదిమందితో వెళ్తామని, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. పంజాబ్‌లో నూరుశాతం ధాన్యం సేకరణ చేసి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేంద్రం ఏ ఆదేశాలు ఇస్తుందో మరోవారం చూస్తామని చెప్పారు. దేశంలో రాజకీయ మార్పు కోసం అగ్గిపెడతామని, ఎక్కడ పెట్టాలో తమకు తెలుసని అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  ‘‘పెట్రోలు, డీజిల్‌తో ధరలు, ఖర్చులు భారీగా పెరిగాయి. పేదల జేబులు కొట్టారు. ఇకనుంచి క్షమించం. పెట్రోలు, డీజిల్‌పై కొండంత పెంచి పిసరంత తగ్గించారు. దేశవ్యాప్తంగా ఉపఎన్నికల్లో భాజపాను ప్రజలు తిరస్కరించారనే భయంతో కేంద్రం పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని కేంద్రం అసత్యాలు చెప్పి. గత ఏడేళ్లలో పెట్రో ధరలు అమాంతం పెంచేసింది. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై రూపాయి కూడా వ్యాట్‌ పెంచలేదు. మమ్మల్ని ఎలా తగ్గించమంటారు? కేంద్రం రాష్ట్రాలకు వాటా దక్కనీయరాదనే కుట్రతో పెట్రోలు, డీజిల్‌పై పన్నులను రద్దు చేసి, సెస్సులను విధించింది. వాటిని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై కేంద్రంతో పోరాటమే. ఉత్తరాది రైతులకు మద్దతుగా ఉద్యమిస్తాం. కేంద్రాన్ని నిద్ర పోనీయం.

రాష్ట్రాలు తగ్గించాలని ధర్నాలా?

పెట్రోలు, డీజిల్‌ ధరలపై కేంద్రం అబద్ధం చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధర ఏడేళ్లలో గరిష్ఠంగా 105 డాలర్లు దాటలేదు. పన్ను రూపంలో వసూలు చేస్తే రాష్టాలకు 41 శాతం వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రాల నోరుకట్టి సెస్‌ అని చెప్పింది. ప్రజల మీద భారం వేయడం, అబద్ధాలు చెప్పడం పచ్చిమోసం. ఇటీవల ఉప ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారని కంటితుడుపుగా తగ్గించి ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని ధర్నాలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో బాధ్యత విస్మరిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని రైతులు వరి మాత్రమే పండించాలని, మెడలు వంచి కొనిపిస్తామని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓవైపు.. కొనబోమని కేంద్రం లేఖలు ఇస్తుంటే.. ఇక్కడి నాయకుడేమో పండించాలని రైతులను అయోమయంలో పడేస్తున్నారు. ఆయన మాటలు నమ్మి వరి వేస్తే రైతులు దెబ్బతింటారు. ఈ ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పలేదు. బాయిల్డ్‌ రైస్‌ కొనేదిలేదని కేంద్రం చెప్పింది. అడ్డందిడ్డం మాట్లాడేవారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. బండి సంజయ్‌కి దమ్ముంటే వారం రోజుల్లో 1.5 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ఆర్డర్‌ తీసుకుని రావాలి. నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి రాష్ట్రం మొత్తం వరి పండించేలా చూస్తాం. తెలంగాణలో వరి వేయద్దని దిల్లీ భాజపా చెబుతుంటే.. ఇక్కడి సిల్లీ భాజపా వేయాలంటోంది. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించబోం. వారిని గందరగోళానికి గురి చేస్తే సంజయ్‌ ఆట కట్టిస్తాం. ఒకవైపు పంజాబ్‌లో ధాన్యం కొంటామని చెబుతున్న కేంద్రం, తెలంగాణలో సేకరణ చేయకపోవడం దారుణం. కేంద్రం రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోంది.

దిల్లీ చుట్టూ తిరిగినా...

కేంద్రం ధాన్యం తీసుకోబోమని మెలికలు తిరుగుతోంది. మంత్రులు, అధికారులు దిల్లీకి వెళ్లి ఒప్పించి, ఎఫ్‌సీఐతో ఎంవోయూ చేసుకున్నా నిరాకరిస్తోంది. రాష్ట్రాలు నిల్వ చేయలేవు. ఎగుమతి చేసే అధికారం లేదు. అన్నిటికీ కేంద్రం వద్దకు వెళ్లాలి. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రంపై ఉంది. నెల క్రితం నేనే స్వయంగా దిల్లీకి వెళ్లి ఆశాఖ మంత్రితో మాట్లాడా. ఎంవోయూ తిరస్కరించడం మంచిది కాదని చెప్పా. కనీసం ఈ ఏడాది ఎంత కొంటారో అంతేవేసి మిగతాది పంట మార్పిడి చేస్తామని చెప్పినా. తొలుత పంట మార్పిడి చేయండి అని చెప్పి తప్పుకొన్నారు. తెలంగాణలో యాసంగి పంట బాయిల్డ్‌ రైస్‌. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకోనంటోంది. తొలుత 50 లక్షల టన్నుల బాయిల్డ్‌రైస్‌ కొనుగోలుకు లేఖ ఇచ్చి, 24 లక్షల టన్నులు తీసుకుంది. మిగతావి తీసుకోబోమని చెబుతున్నారు. దిల్లీ వెళ్లి మిగతా ధాన్యం పరిస్థితి ఏమిటని అడిగితే.. భవిష్యత్తులో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాతపూర్వకంగా రాసివ్వాలని అడిగారు. బలవంతం మీద లెటర్‌ రాసిచ్చాం. ఇంకా 5 లక్షల టన్నుల గత యాసంగి పంట ఇంకా మిగిలింది. గత ఏడాదికి పక్కన పెడితే ఈ ఏడాదికి ఎంత ఇస్తారో చెప్పాలంటే, తరువాత మాట్లాడుతామన్నారు. ఇక్కడే ఉండి మాట్లాడతానంటే.. మరుసటిరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంత తీసుకుంటారని అడిగితే.. ఇప్పటికీ ఎంత తీసుకుంటారో చెప్పలేదు. రాష్ట్రంలో రైతులు వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కోతలు మొదలయ్యాయి. వానాకాలం పంటే 1.7 కోటి టన్నుల వడ్లు.. బియ్యంగా మార్చితే 1.10 కోట్ల టన్నుల రైస్‌ రెడీగా ఉంది. దీన్ని తీసుకునే దిక్కులేదు. కేంద్రమంత్రి రెండురోజుల్లో చెబుతానని చెప్పలేదు. రైతుల బతుకు ఆగం చేసేందుకు వరి పండించాలంటున్నారు. ధాన్యం తీసుకుని రైతులు రోడ్లపై ధర్నాలు చేయాలి. నీ రాజకీయ పబ్బం గడవాలా? ఈ మాటలు విని వరి వేస్తే దెబ్బతింటం. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రాష్ట్రంలో రైతులను ఏడేళ్లుగా కాపాడింది ఎవరో తెలుసు. వానాకాలం పంట తీసుకుంటారో లేదో తెలియకున్నా కొనుగోళ్లు ప్రారంభించాం. దిల్లీలో ధాన్యం కొనరు. కానీ యాసంగిలో వరి వేయమంటారు. ఇది మోసం కాదా?

దేశాన్ని సాకుతున్నాం...

దేశాన్ని సాకుతున్నది తెలంగాణ. మేం ఇచ్చే డబ్బుమీద దిల్లీ నడుస్తోంది. కేంద్రం నుంచి గడిచిన ఏడేళ్లలో రూ. 42వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధిహామీ, జాతీయ హెల్త్‌మిషన్‌, సర్వశిక్ష అభయాన్‌ కింద నిధులు వస్తాయి. మిగతా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. కానీ మంత్రుల మీద, సీఎంల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

అడుగడుగునా తరిమికొడతాం...

గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. భాజపా ఎంపీలు చేసిన ఒక్క మంచిపని అయినా ఉన్నదా? కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రూ. 10 పని చేశారా? కేంద్రం నుంచి ఏమీ చేయకుండా మెడలు విరుస్తామంటూ పిచ్చికూతలు కూస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అడుగడుగునా తరిమికొడతాం. మీ చిల్లర రాజకీయాల కోసం రైతుల బతుకులు నాశనం చేస్తే కేసీఆర్‌ ఊరుకోరు. నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు. ఏ విచారణ చేస్తారో మేం సిద్ధం. మేం ఉద్యమాలు చేసినవాళ్లం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సినవి చేయకున్నా సహకరిస్తున్నాం. అయినా దిగజారి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర అధ్యక్షుడు లేఖ ఇచ్చారని అప్పటి మంత్రి జావడేకర్‌ స్వయంగా చెప్పారు’’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.


రాజకీయాలు అన్నాక గెలుస్తాం. ఓడతాం.. ఎన్నిక వస్తది.. పోతది. ఉత్తమ్‌ నియోజకవర్గంలో గెలవలేదా? సాగర్‌ ఎన్నికల్లో మీకు (భాజపా) డిపాజిట్‌ కూడా రాలేదు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మీరు ఓడిపోయారు. అంటే దేశంలో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లా?


ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకువచ్చినోళ్లం. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం. తెలంగాణకు ఒక గమ్యం, లక్ష్యం ఉన్నాయి. అక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. దేశంలో ఎక్కడైనా దళితబంధు అమలు చేశారా? కనీసం మీ రాష్ట్రాల్లో రూ. 2,000 పింఛను ఇచ్చే ముఖం ఉందా?


తెలంగాణ పెట్రోలు, డీజిల్‌ ధరలు రూపాయి కూడా పెంచలేదు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగకున్నా పెరిగాయంటూ కేంద్రం అబద్ధాలు చెప్పి సెస్‌ రూపంలో ధరలు పెంచింది. రాష్ట్రాలకు అన్యాయం చేసింది. పెట్రోలు ధరలు పెంచినవారే తగ్గించాలి.
శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా చెప్పా. రైతులు ఏ పంటలు వేయాలో నవంబరులో ప్రకటిస్తామన్నాం. రైతులు వరి వేస్తే నష్టపోతారని, ఏ పంటలు వేస్తే బాగుంటుందో సమీక్షించాం. నువ్వులు, ఆవాలు, పల్లీ వంటివి వరికన్నా లాభం వచ్చే పంటలు. రైతులు నష్టపోకూడదని, వారిని కాపాడుకోవాలని ఇతర పంటలు వేయాలని చెప్పాం.


ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటున్న బండి సంజయ్‌ దమ్ముంటే నా మీద కేసు పెట్టాలి. కేంద్రం నుంచి వచ్చే జీవోలు వీరికి అర్థం కావు. కరీంనగర్‌ నుండి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి ఏం చేశారు? భాజపా నేతలకు చిన్నాపెద్దా ఏమీ లేదా? ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఏడేళ్లలో కేంద్రం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలి. నేను కూడా కేంద్రమంత్రిగా చేశా.. హుజూరాబాద్‌లో కిషన్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?


* మిమ్మల్ని ఇప్పటి వరకు క్షమించాం- ఇక నుంచి క్షమించం. మీ చరిత్ర అంతా ప్రజలకు తేటతెల్లం చేస్తాం

* రైతులను ముంచి ఓట్లు డబ్బాలో వేసుకోవాలనేది భాజపా పన్నాగం. దాన్ని నడవనివ్వను. భాజపా.. బీకేర్‌ఫుల్‌

* తెలంగాణకు నీళ్లు వద్దా? కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు డ్రామాలేమిటి? కేంద్రమంత్రి షెకావత్‌ ఇచ్చిన మాట ప్రకారం ట్రైబ్యునల్‌కు ఎందుకు పంపరు?

* నేను కష్టపడి తెలంగాణ తెచ్చాను. అల్లాటప్పాగాళ్లు దాన్ని ఆగం చేస్తుంటే ఊరుకోను.

* అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఊళ్లకు ఊళ్లే కడుతోంది దేశ సరిహద్దు కాపాడటంలో భాజపా విఫలమైంది.


రాష్ట్రమంతా దళితబంధు

రాష్ట్రమంతటా దళితబంధు నూరుశాం అమలు చేస్తాం. భాజపా నాయకులకు చట్టాలపై కనీస అవగాహన లేదు. ఎస్సీ, ఎస్టీలంటే భాజపాకు గౌరవం లేదు. దళిత, గిరిజనులపై అత్యాచారాల నిరోధానికి తెచ్చిన చట్టాన్ని ఒకాయన పనికిరాని చట్టం అని అన్నాడు. మీ ఏడేళ్ల పరిపాలనలో ఒక్క మంచిపని ఉందా? దళితులు, గిరిజనులు, బీసీలు, రైతులు, నిరుద్యోగులకు ఏం చేశారు? రూ. 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? ఏ మాటపై భాజపా నిలబడింది? సందర్భం వచ్చినపుడు భావోద్వేగాలు రెచ్చగొడతారు. అంతర్జాతీయ, మతరపమైన ఉద్వేగాలు సృష్టిస్తారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కన్నా జీడీపీ తక్కువగా ఉంది. చేతగాక, చేయలేక అడ్డగోలు పరిపాలనతో ఈ పరిస్థితి తీసుకువచ్చారు. ఏడేళ్లలో రూ. 70-80 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఓవైపు సరిహద్దులో చైనా గ్రామాలు నిర్మిస్తోంది. ఎల్‌ఐసీని ఎందుకు ప్రైవేటీకరిస్తారు? కొవిడ్‌ టైమ్‌లో గంగానదిలో శవాలు తేలాయి. బావుల వద్ద మీటర్లు పెట్టాలని ప్రభుత్వాలపై వత్తిడి తీసుకువస్తున్నారు. లేదంటే ఆర్‌ఈసీ రుణాలన్నీ బంద్‌ చేస్తామంటున్నారు. ఇక మేం కేంద్రంలోనూ, ఇక్కడా భాజపా వెంట పడతాం.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని