Huzurabad By Election: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ రోడ్‌షోలు!

ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహం మార్చింది....

Updated : 24 Sep 2022 14:26 IST

రెండురోజులు నిర్వహించే అవకాశం
ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు ప్రత్యామ్నాయంపై దృష్టి
మంత్రులు, నేతలతో చర్చించిన సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహం మార్చింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌కు పొరుగున గల హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలిసింది.సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై శుక్రవారం స్పష్టత వచ్చే వీలుంది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా సీఎం కేసీఆర్‌ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.

పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌
హుజూరాబాద్‌లోని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సభపై ఆంక్షలున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనలను అనుసరించి నియోజకవర్గంలోనే రోడ్‌షోలు నిర్వహించాలనే అంశం చర్చకు వచ్చింది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించాలని మంత్రులు కోరగా... సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూలును రూపొందించి పంపాలని కేసీఆర్‌ స్థానిక మంత్రులు, నేతలకు సూచించారు. శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలతో సమావేశమై షెడ్యూలుకు రూపకల్పన చేసి, సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు