KTR: పరిశ్రమల గమ్యస్థానం తెలంగాణ

దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సహా అనేక రాష్ట్రాలు నేడు అమలు....

Updated : 28 Sep 2021 09:37 IST

కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్న సీఎం
ఆర్బీఐ, నీతి ఆయోగ్‌ నివేదికలే మన అభివృద్ధికి నిదర్శనం
కేంద్రం నుంచి ఎలాంటి సాయమూ లేదు...
ఫార్మా భూములపై చిల్లర రాజకీయాలు
శాసనసభలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సహా అనేక రాష్ట్రాలు నేడు అమలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థ నాయకత్వం...సుస్థిర ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా, ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్‌ బస్సు, ఎలక్ట్రిక్‌ బస్సు నుంచి ఎయిర్‌ బస్సు దాకా, టైల్స్‌ నుంచి టెక్స్‌టైల్స్‌ వరకూ, యాప్‌ నుంచి యాపిల్‌ దాకా ప్రతి పరిశ్రమ గమ్యస్థానం తెలంగాణ అని గుర్తించాలన్నారు. సోమవారం పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధిపై శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో దేశానికి మూడు ‘ఐ’లు కీలకమని స్పష్టంగా చెప్పా. అవి ఆవిష్కరణ (ఇన్నోవేషన్‌), మౌలిక సదుపాయాలు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్‌గ్రోత్‌). వీటి సాధనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకెళ్తోంది. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలనే సంకల్పం సీఎంది. టీఎస్‌ఐపాస్‌ వినూత్న విధానం ముఖ్యమంత్రి ఆలోచన ఫలితమే. నేడు దేశం ఆశ్చర్యపోయేలా సాగునీటి రంగంలో తెలంగాణ ముందుకెళ్లింది. రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం ఆర్‌బీఐ, నీతిఆయోగ్‌ నివేదికలే. వచ్చే 20 ఏళ్ల వరకూ తెరాస ప్రభుత్వమే ఉంటుంది.

ఉపాధి కల్పనే లక్ష్యం
రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన. ఇప్పుడు కొందరు నిరుద్యోగ గర్జన, మిలియన్‌ మార్చ్‌ అని చెబుతున్నారు. ఏ దేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు శాతం దాటవు. తెలంగాణలోని 4 కోట్ల జనాభాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడెనిమిది లక్షలకు మించవు. ఉపాధికి కీలకమైన ప్రైవేటు రంగంలో పెట్టుబడులు భారీగా వచ్చేలా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం కృషి చేస్తోంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 17,302 పరిశ్రమలకు అనుమతి ఇవ్వగా వాటి ద్వారా రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఇప్పటికే వీటిలో 13 వేల పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. పరిశ్రమలశాఖ ద్వారా 16 లక్షల మందికి, ఐటీ శాఖ ద్వారా 3.05 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో 1,264 సంస్కరణలు తీసుకురాగా దేశంలో రాష్ట్రం అనేక అంశాల్లో ఒకటి, రెండు, మూడు స్థానాల్లోనే ఉంది. కైటెక్స్‌ కోసం శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా మన దేశంలోని 15-20 రాష్ట్రాలు పోటీ పడితే పారదర్శక విధానాలకు మెచ్చి ఇక్కడ ఆ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. 14 ప్రాధాన్య రంగాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రపంచానికి 33 శాతం వ్యాక్సిన్‌లను హైదరాబాద్‌ అందిస్తోంది. బీఈ, భారత్‌ బయోటెక్‌ వంటి సంస్థలు మనకున్నాయి. డ్రోన్‌పాలసీ తెచ్చిన మొదటి రాష్ట్రం మనది. సైబర్‌ నేరాలపై రాష్ట్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఇక్కడ రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఏరోస్పేస్‌ ఉత్పత్తులకు తెలంగాణ కీలకంగా మారింది. బోయింగ్‌ సహ అనేక ప్రముఖ కంపెనీలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ బాడీ కూడా హైదరాబాద్‌లో తయారైందే.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ తెలంగాణలో ఏర్పాటవుతోంది. 12 వేల ఎకరాలకు గాను 10,400 ఎకరాల భూమిని సేకరించాం. ప్రభుత్వం రూ.10-15 లక్షలకు భూములను తీసుకుని రూ.2 కోట్లకు అమ్ముకుంటోందని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఫార్మాసిటీలో పరిశ్రమలకు దసరాకు భూములు కేటాయిస్తాం. దీనివల్ల రూ.65 వేల కోట్ల పెట్టుబడులు.. ఐదారు లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2030 నాటికి జీవ ఔషధ] రంగంలో వంద బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 4 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. బీ-హబ్‌లో బయోఫార్మా పరిశ్రమలు వస్తాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్‌మజుందార్‌ షా రూ.700 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చారు.

నాడు పవర్‌ హాలిడే...నేడు పవర్‌ జాలీడే
ప్రతిపక్షనేతలు రాష్ట్ర అభివృద్దికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారు. వారి ఫొటోలు, ఫ్లెక్సీల్లో ఎక్కడ చూసిన నీళ్లు, పైర్లు, మిషన్‌భగీరథ కుళాయిలే కనబడుతున్నాయి. కాంగ్రెస్‌ పాలనలో పవర్‌ హాలిడేలు ఉంటే ఇప్పుడేమో పవర్‌ జాలీడేలు. గతంలో పరిశ్రమ రావాలంటే నీకెంత... నాకెంత అనే విధానం ఉండేది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌కు ఐటీ పరిశ్రమను తీసుకెళ్లగా త్వరలో రామగుండం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నల్గొండకూ వస్తాయి.

రాష్ట్రం స్టార్టప్‌..కేంద్రం ప్యాకప్‌
రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ అని అంటే కేంద్రం ప్యాకప్‌ అంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మాట సాయంలేదు...మూట సాయంలేదు. విభజన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు పరిశ్రమలేదు. ఐటీఐఆర్‌ లేదు. సీసీఐని తెరవాలని అంటే అమ్మేద్దామని కేంద్రం అంటోంది. ఐడీపీఎల్‌ను ప్రారంభించాలని కోరితే ఆ భూములు అమ్ముతాం కొనుక్కుంటారా?అని కేంద్రం లేఖ రాసింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌, వరంగల్‌, ముంబాయి, బెంగళూరు, విజయవాడ ఐదు పారిశ్రామిక కారిడార్‌లను అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. ఫార్మాసిటీకి రూ.1000 కోట్లు కోరితే పైసా లేదు. కొత్త రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలు దేశంలో అవసరంలేదని చెప్పిన కేంద్రం 2018లో లాతూర్‌కు మంజూరు చేసి పూర్తి చేసింది. నలుగురు భాజపా ఎంపీలుండగా ఒకరి పరిధిలో ఐటీఐఆర్‌, కరీంనగర్‌లో ఐఐఐటీ, మరో ఎంపీ ఇలాకాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఇంకో ఎంపీ ప్రాంతంలో పసుపుబోర్డు ఏర్పాటు కావాలి? ఒకరైతే బాండ్‌ కూడా రాశారు ఏమైంది? ఒకటైనా వచ్చిందా? పట్ణణాలతో పాటు గ్రామీణ వికాసమే లక్ష్యంగా హరిత విప్లవం (పంటల ఉత్పత్తి), పింక్‌ రెవల్యూషన్‌ (పశు సంపద), నీలి విప్లవం (మత్స్యసంపద), శ్వేత విప్లవం (పాల ఉత్పత్తి)దిశగా ప్రభుత్వం వెళ్తోంది. చేనేతరంగానికీ చేయూతనిస్తోంది. ఇప్పటి దాకా రూ.5.51 కోట్ల బతుకమ్మ చీరలను రూ.1,466 కోట్లతో కొని తోడ్పాటునిచ్చింది’ అని మాట్లాడారు.


దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం రాష్ట్రం

‘దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ కీలకంగా మారింది. జీడీపీ వాటాలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. 2014-15లో మన తలసరి ఆదాయం రూ1,24,104 ఉండగా 2020-21కి ఇది 2,37,632కు పెరిగింది. దేశ తలసరి ఆదాయం సగటు రూ,.1,28,829 మాత్రమే. దేశ భౌగోళిక విస్తీర్ణంలో రాష్ట్రం 11 స్థానంలో, జనాభాలో 12వ స్థానంలో ఉండగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటులో నాలుగో స్థానంలో ఉండటం గర్వకారణం. కొవిడ్‌ నేపథ్యంలో దేశ జీడీపీ తగ్గినా పటిష్ఠ చర్యలతో రాష్ట్ర జీఎస్‌డీపీ పెరిగిందని గుర్తించాలి. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వరిలో పంజాబ్‌ను మించింది. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని ఎఫ్‌సీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను 2018, 2020లో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌, ఎంపీ కార్తీ చిదంబరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు’


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని