Power Crisis: కరెంటు సంక్షోభం రానే రాదు

దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం ముంచుకురాబోతోందని చెప్పడంలో అర్థం లేదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల డిమాండ్‌కు తగ్గట్టు

Updated : 11 Oct 2021 10:32 IST

దేశంలో బొగ్గు కొరత లేదు

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా నిల్వలు

కోల్‌ ఇండియా వద్ద మరో నాలుగు కోట్ల టన్నులు

అనవసర భయాందోళనలు వద్దు

కేంద్ర బొగ్గు శాఖ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం ముంచుకురాబోతోందని చెప్పడంలో అర్థం లేదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల డిమాండ్‌కు తగ్గట్టు నల్లబంగారం అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాల్లో 72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతాయని తెలిపింది. కోల్‌ ఇండియా వద్ద 4 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. వాటిని విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని చెప్పింది. కాబట్టి అనవసర భయాందోళనలు వద్దని చెప్తూ బొగ్గుశాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘విద్యుత్‌ కర్మాగారాలకు రోజువారీగా సుమారు 18.7 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉండగా, 17.5 లక్షల టన్నులు సరఫరా అవుతోంది. ప్లాంట్లకు బొగ్గు సరఫరా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు కరిగిపోతున్నాయన్నది అవాస్తవం. ఈ ఏడాది విదేశీ బొగ్గు అవసరాలను దేశీయ కంపెనీలే విస్తృత స్థాయిలో తీరుస్తున్నాయి. బొగ్గు క్షేత్రాల పరిధిలో భారీ వర్షాలు పడినప్పటికీ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ విద్యుత్‌ రంగానికి 25.5 కోట్ల టన్నులు సరఫరా చేసింది. 6నెలల్లో ఇంత భారీమొత్తంలో సరఫరా చేయడం ఇదే తొలిసారి. అన్ని మార్గాలను కలుపుకొని కోల్‌ ఇండియా ఇప్పటివరకు విద్యుత్‌ రంగానికి రోజుకు సగటున 14 లక్షల టన్నులు సరఫరా చేసింది. వర్షాలు తగ్గిన తర్వాత 15 లక్షల టన్నులకు పెంచింది. అక్టోబరు చివరినాటికల్లా రోజుకు సగటున సరఫరా చేసే బొగ్గు 16 లక్షల టన్నులకు మించుతుంది. సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌, ఇతర సొంత గనుల నుంచి మరో 3 లక్షల టన్నులు రోజూ సరఫరా అవుతోంది’’ అని ప్రకటనలో తెలిపింది.

అదే నిదర్శనం..

‘‘ఒకవైపు విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేస్తూనే.. అల్యూమినియం, సిమెంటు, ఉక్కు వంటి విద్యుత్తేతర పరిశ్రమలకు కోల్‌ ఇండియా రోజూ 2.5 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. దేశంలో నల్లబంగారం సరఫరా సంతృప్తికరంగా ఉందనడానికి ఇదే నిదర్శనం’’ అని బొగ్గుశాఖ పేర్కొంది.


ఒక్కరోజులో 19.2 లక్షల టన్నుల సరఫరా

దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు శనివారం ఒక్కరోజే 19.2 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ కేంద్రాల్లో రోజువారీ వినియోగానికి 18.7 లక్షల టన్నులే అవసరమని గుర్తుచేసింది. కోల్‌ ఇండియా, సింగరేణి, సొంత గనులు, దిగుమతులు.. ఇలా అన్నిమార్గాలు కలిపి అవసరాలకు మించి బొగ్గు సరఫరా చేసినట్లు వెల్లడించింది. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోని నిల్వలపై విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు