MLC Elections: డిసెంబరు 10న ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో 12 స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు

Updated : 10 Nov 2021 05:36 IST

స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలో 12, ఏపీలో 11 స్థానాలు

16న నోటిఫికేషన్‌ జారీ

ఎన్నికల నియమావళి అమల్లోకి

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి డిసెంబరు 10న పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో 12 స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 23వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. డిసెంబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

తెలంగాణలో 9,835 మంది ఓటర్లు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 మంది శాసనమండలి సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో 9,835 మంది ఓటర్లుగా పాల్గొననున్నారు. ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులే ఓటర్లు.
స్థానిక సంస్థల్లో మొత్తం 10,013 స్థానాలకు గాను 178 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 9,835 మంది సభ్యులే పోలింగులో పాల్గొననున్నారు.

జనవరి 4న పదవీ కాలం ముగుస్తున్న మండలి సభ్యులు

పురాణం సతీష్‌ (ఆదిలాబాద్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), బి.భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబాబాద్‌), పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు(రంగారెడ్డి)

ధర్నాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

- డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌, తెలంగాణ ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి

తెలంగాణలో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ తక్షణం అమలులోకి వచ్చింది. ఉపఎన్నిక తరహాలో ఇది  ఉంటుంది. హైదరాబాద్‌ మినహా ఎక్కడైనా పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు చేయాలంటే ముందస్తుగా కలెక్టర్ల అనుమతి తీసుకోవాలి. ఆ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు స్పష్టం చేశాం. నామినేషన్ల సందర్భంగా ర్యాలీలకు అనుమతి లేదు. 500 మందికి మించి సభలు నిర్వహించకూడదు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదు. జిల్లాల్లో అందరికీత కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని